ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు బయల్దేరుతున్న ఉద్యోగులు
సాక్షి, సిరికొండ: డిసెంబర్ మొదటి వారంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్లు జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుల వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. 42 అంశాలతో ప్రతి ఎన్నికల సిబ్బంది వివరాలను అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. అలాగే ఎన్నికల భత్యాన్ని నేరుగా సిబ్బంది ఖాతాలకు జమ చేయడానికి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల అకౌంట్ నంబర్లను కూడా సేకరిస్తున్నారు. జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, ఉద్యోగుల వివరాల సేకరణపై ప్రత్యేక కథనం..
అధికారులకు శిక్షణ పూర్తి
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 17,88,036 మంది ఓటర్లు ఉన్నారు. 1,903 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఇప్పటికే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఈవీఎంలు గోదాంలకు చేరుకున్నాయి. ఆయా ఈవీఎం, వీవీప్యాట్ల తొలిదశ పరిశీలన పూర్తయింది. జిల్లా స్థాయి అధికారులైన ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలకు శిక్షణ పూర్తయింది. ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బందికి సంబంధించిన కరదీపికలు జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం
ఈ ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల పూర్తి వివరాలు అధికారులు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. 42 అంశాల వారీగా ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగుల ఓటరు గుర్తింపు కార్డులు మొదలుకొని బ్యాంకు ఖాతా నంబర్ వరకు ప్రతి ఒకటి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఉద్యోగి పేరు. శాఖ గ్రామం, సొంత మండలం, నియోజకవర్గం, విధుల్లో ఎప్పుడు చేరారు, పదవీ విరమణ ఎప్పుడు, ఇంతకు ముందు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారా, జీతభత్యాలు, ఎలక్టోరల్ సంఖ్య, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మొదలైన వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు.
విధులకు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయులు, 15 వేల మంది ఉద్యోగులున్నారు. ఎన్నికల సంఘం కొత్త జిల్లాల కేంద్రంగానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడం, ఓట్ల లెక్కింపు కూడా కొత్త జిల్లాల ప్రకారమే చేయాలని నిర్దేశించడంతో ఉద్యోగుల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉండే సిబ్బంది సరిపోకపోవడంతో పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలను కూడా ఎన్నికల విధుల్లో వినియోగించుకోనున్నారు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది ఇతర ఉద్యోగులను వినియోగించుకునే అవకాశం ఉంది.
భత్యం పంపిణీలో పారదర్శకత
ఈ సారి జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎన్నికల భత్యం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి అధికారులు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశారు. ఇతర సిబ్బందికి చెల్లించే భత్యాలను కూడా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.
విధుల ధ్రువపత్రాలు సకాలంలో అందేనా?
ప్రతిసారి ఎన్నికల్లో పాల్గొన్న ఎన్నికల సిబ్బందికి విధుల ధ్రువపత్రాల జారీలో ఆలస్యమవుతోంది. పోలింగ్ జరిగిన రోజు రాత్రికల్లా పోలింగ్ యంత్రాల పరికరాలను అందజేసిన తర్వాత ప్రత్యేక కౌంటర్ల ద్వారా విధుల ధ్రువపత్రాలను ఇవ్వాలి. కానీ ప్రతిసారి ఎన్నికల్లో ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో తాము ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లు సర్వీసు పుస్తకాల్లో నమోదు చేసుకోవడం, అవసరమైన అర్జిత సెలవులు పొందడం కష్టమవుతోంది. కావున అధికారులు ఆ దిశగా ఆలోచించి ఎన్నికల సిబ్బందికి సకాలంలో ధ్రువపత్రాలు అందచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment