కాలం మారేకొద్ది మనుషులూ మారుతున్నారు. అంతేనా అంటే రాజకీయ పార్టీలూ మారుతున్నాయి! సభలు, సమావేశాలకు వచ్చేవారికి కాస్తయినా మర్యాద చేయాలి. అందుకు వచ్చినవారికి ఒక్కో టోకెన్ చొప్పున ఇస్తున్నారు. ఆ టోకెన్‌ను సంబంధిత వైన్స్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా రాజకీయ పార్టీలకు వైన్స్‌ల నిర్వాహకులు సహకరించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం అది నేరమంటున్నారు.
సాక్షి, కామారెడ్డి క్రైం: రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికలంటేనే డబ్బు, మద్యంతో సావాసం. ఇదివరకు గ్రామంలోని ఓ పార్టీ పెద్దమనిషి చీటి రాసి ఇస్తే కల్లు దుకాణంలో కల్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఎన్నికల వేళ కల్లును ఆశించే వారే లేరు. ప్రచారానికి వచ్చే వారి నుంచి మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మద్యం, నగదులాంటి ప్రలోభాలకు ఓటర్లను గురిచేయడం నేరం. ఇలాంటి నిబంధనలను తప్పించుకుంటూ తమ వారికి మద్యం, నగదు అందించేందుకు ఆయా పార్టీల పెద్దలు కొత్తదారులు వెతుకుతున్నారు. మద్యం దుకాణాల ద్వారా తమ కార్యకర్తలకు మందు సరఫరా చేసేందుకు కొత్తగా టోకెన్ పద్ధతిని అనుసరిస్తున్నారు.
రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు జనాన్ని తరలించిన సందర్భాల్లో, ఇతర ప్రచార కార్యక్రమాల సమయాల్లో మద్యాన్ని నేరుగా ఇవ్వకుండా టోకెన్‌లు ఇస్తున్నారు. వారిచ్చిన టోకెన్ తీసుకుని వైన్స్‌కు వెళితే ఒక్కో లోకెన్‌కు ఒక మందు బాటిల్ చొప్పున ఇచ్చేస్తారు. గతంలోనూ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సమయాల్లో ఈ విధమైన పద్ధతులను అనుసరించినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో టోకెన్‌లకు గిరాకీ బాగా పెరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ వ్యాపారమే పరమావధిగా తీసుకుంటున్న వైన్స్‌ల నిర్వాహకులు పార్టీల పెద్దలకు తమ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
మచ్చికతో రాజకీయ మర్యాద..
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టోకెన్ పద్ధతిలో మద్యం పంపిణీ నడుస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పార్టీ సమావేశం అనంతరం కొందరు కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఓ పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుడు తనకు పైనుంచి వచ్చిన 70 టోకెన్‌లు పంచేశానని, మిగిలినవారు అడిగితే ఎక్కడి నుంచి తేవాలనడం ఆశ్చర్యానికి గురిచేసింది. తమ వెంట వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ప్రచారం పూర్తయ్యాక మర్యాదలు చేసేందుకు నేరుగా కొంత డబ్బును, మద్యం టోకెన్‌లను ఇచ్చుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మద్యం నిల్వలు తమ దగ్గర పెట్టుకునే బాధలేకుండా రాజకీయ పార్టీల నేతలకు వైన్స్‌ల నిర్వాహకులు విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో టోకెన్ పద్ధతిలో మద్యం విక్రయించే వారిపై ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
నిబంధనలకు విరుద్ధం..
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నేరం. అయినా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. టోకెన్ పద్ధతిలో మద్యం కొనుగోళ్లకు అనుమతి లేదు. రాజకీయ పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు ఇలాంటి పద్ధతులను అవలంబిస్తుండగా దుకాణాల యజమానులు వ్యాపారం ముసుగులో పార్టీలకు సహకారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బెల్టుషాపుల్లో సైతం టోకెన్ సిస్టం అమలవుతోంది. ఇప్పటికే జిల్లాలోని చాలాచోట్ల దాడులు చేసి అక్రమ మద్యం నిల్వలు, రవాణాను ఎక్సైజ్ అధికారులు పట్టుకుని కేసులు చేశారు. టోకెన్ విధానంలో మద్యం విక్రయాలు చేయకూడదని చెబుతున్నారు. తమ దృష్టికి వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment