సాక్షి, కామారెడ్డి అర్బన్: పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో సహా నలుగురు సిబ్బంది ఉంటారు.
పోలింగ్ బూత్‌లో సిబ్బంది ఇలా..
- బూత్‌లో మొదటి పోలింగ్ అధికారి మార్క్‌డ్ కాపీ ఓటర్ల జాబితాకు ఇన్‌చార్జి. ఓటర్లను గుర్తించే తొలి బాధ్యత ఈయనదే. ఓటరు గుర్తింపును సంతృప్తి జాబితాలోని పార్టు నెంబర్, సీరియల్ నెంబర్ ఏజెంట్లకు వినబడేలా చదువుతారు.
- రెండవ పోలింగ్ అధికారి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. గుర్తించిన ప్రతి ఓటరు వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, ఓటరు సంతకం లేదా వేలిముద్రను తీసుకుంటారు. ఓటర్ స్లిప్పు అందజేస్తాడు.
- మూడవ పోలింగ్ అధికారి ఓటింగ్ యంత్రం కంట్రోల్ యూనిట్ అధికారి. ఈయన రెండో అధికారి టేబుల్ పక్కనే కూర్చుని రెండో అధికారి ఇచ్చిన ఓటరు స్లిప్పు ఆధారంగా సీరియల్ నంబర్, వివరాలు, ఎడమ చేతికి సిరా ఉందో లేదో సరిచూసుకున్న పిదప బ్యాలెట్ బటన్ నొక్కి ఓటింగ్‌కు సిద్ధం చేసి ఓటరును ఓటింగ్ బూత్‌లోకి అనుమతిస్తారు. పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటే మూడో పోలింగ్ అధికారి విధులను ప్రిసైడింగ్ అధికారే నిర్వహిస్తారు.
- నాలుగో పోలింగ్ అధికారి ఓటింగ్ యంత్రాలపై తప్పుడు మెస్సేజ్‌లు వస్తాయేమో అని నిరంతరం గమనిస్తూ ఉంటారు. తప్పులు జరిగితే వెంటనే ప్రిసైడింగ్ అధికారికి తెలియజేస్తారు. వీవీ ప్యాట్ దోషాలు కంట్రోల్ యూనిట్ పై డిస్‌ప్లే అవుతాయి.
- సిబ్బంది తెల్లవారు జామున 5 గంటలకే డ్యూటీలో చేరిపోతారు. పోలింగ్ స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని సిద్ధమవుతారు.
- 6 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో 15 నిమిషాల పాటు నమూనా పోలింగ్ నిర్వహిస్తారు. 50 ఓట్ల చొప్పున ఏజెంట్ల సమక్షంలో వారితో ఓట్లు వేయించి, కంట్రోల్ ప్యానల్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చింది లెక్కిస్తారు. అనంతరం వీవీ ప్యాట్ తెరిచి అభ్యర్థుల గుర్తుల వారీగా వచ్చిన స్లిప్పులను లెక్కిస్తారు. రెండు లెక్కలు సరిపోతే ఓకే.. లేకుంటే సాంకేతిక నిపుణులను పిలిచి మిషన్లను సరిచేసిన పిదపనే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు వరుసలో ఉన్న వారందరికి ఓటు వేయడానికి అనుమతిస్తారు.
పోలింగ్ స్టేషన్‌కు చేరిన తరువాత..
పోలింగ్ బూత్‌లో అన్ని సౌకర్యాలున్నాయో లేదో సరి చూసుకోవాలి. మొత్తం ఆరు టేబుళ్లు, ఆరు కుర్చీలు కచ్చితంగా అవసరం. పోలింగ్ అధికారులను ఎలా కూర్చోబెట్టాలో సరి చూసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ బూత్ నెంబరును వెలుపల అతికించాలి. ఓటరు నెంబర్లు, ఇంటి నెంబర్లు మొదటి ప్రారంభం నుంచి చివరి దాకా రాసిపెట్టాలి. ఏ అధికారి ఎక్కడ ఉంటారో పోలింగ్ ఆఫీసర్–1, పోలింగ్ ఆఫీసర్–2 ఇలా రాసి పెట్టాలి.
పోలింగ్ రోజు..
పోలింగ్ రోజు ముందుగా వాక్స్, అగ్టిపెట్టే, నీళ్లు, సీల్, మొదలైన వాటిని సీలింగ్ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. మాక్ పోలింగ్ కోసం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌లను కనెక్ట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. పోలింగ్ ఏజెంట్లు రాగానే వారి వద్ద అపాయింట్ ఆర్డర్స్‌ను తీసుకుని పాస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్, స్ట్రిప్ సీల్, అడ్రస్ ట్యాగ్‌ల నెంబర్లు నోట్ చేసుకున్న తరువాత, ఏజెంట్లను నోట్ చేసుకోమనాలి. తరువాత వాటిపై ఇరువురు సంతకాలు చేయాలి. ఏజెంట్ల సమయంలో మాక్ పోలింగ్ నిర్వహించాలి. మాక్ పోలింగ్ పూర్తయినట్లుగా రిటర్నింగ్ అధికారి ధ్రువకరించిన తరువాత పోలింగ్ ప్రారంభిస్తున్నట్లుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమాచామివ్వాలి.
7 గంటలకు ప్రారంభం
సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ ఏజెంట్ల నుంచి కూడా సంతకాలు తీసుకోవాలి. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఎంత ఓటింగ్ అయ్యిందో కంట్రోల్ యూనిట్‌లోని టోటల్ బటన్‌ను నొక్కి చూసుకుని పోలింగ్ అధికారి డైరీలో నోట్ చేసుకోవాలి. పోలింగ్ సమయం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది కనుక చివరి ఐదు నిమిషాల ముందుగా ఓటర్లు ఇంకా క్యూలో
ఉన్నచో వారికి అంకెల స్లిప్పులు అందజేయాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే కంట్రోల్ యూనిట్‌లో టోటల్ బటన్ నొక్కి మొత్తం పోలైన ఓట్ల సంఖ్యను చూసుకోవాలి. తరువాత కంట్రోల్ యూనిట్‌ను స్విచ్ఛాఫ్ చేసి, పోలింగ్ సరైన సమయానికి పూర్తయినట్లు ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకోవాలి.
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణ అధికారులకు కత్తి మీద సాములాంటిదే! ఎన్నికలు సజావుగా, సక్రమంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా జరగాలంటే ఎన్నికల్లో విధులు నిర్వహించే వివిధ రకాల పోలింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రతీ క్షణం అలర్ట్‌గా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా చిక్కులు తప్పవు. అధికారులు శిక్షణ ఎంత పొందినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. ఈ చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది.
పోలింగ్ సరిళి ఎలా ఉంటుంది, ప్రిసైడింగ్ అధికారులు ఏం చేయాలి, ఇతర పోలింగ్ సిబ్బంది చేయాల్సిన పనులేంటి, అసలు ఓటింగ్ ప్రక్రియకు ముందు ఎలా సంసిద్ధం కావాలి, పోలింగ్ ప్రక్రియను ఎలా ప్రారంభించాలి, పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది ఉండాల్సిన స్థానాలేంటి, మాక్ పోలింగ్ విధానం, ఓటింగ్ పూర్తి తరువాత చేయాల్సి పనులు, ఇతరాత్ర విషయాలను కులంకషంగా తెలుపుతూ ఎన్నికల కమిషన్ మోడల్ పోలింగ్ కేంద్రాల మ్యాప్‌లను తయారు చేసి పంపింది. వీటి ఆధారంగా పోలింగ్ అధికారులకు మరింత అవగాహన ఏర్పడుతుంది. అలాగే మొత్తం పోలింగ్ సరళిని తెలియజేసే అంశాలను కూడా బుక్‌లెట్ రూపంలో అందజేసింది.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో..
పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే సిబ్బంది ఈవీఎం, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్, ఇతర మెటీరియల్‌తో పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే, చెక్ లిస్టు ప్రకారం అంతా సరిగ్గా ఉందో లేదో హ్యాండ్‌బుక్ పేజీ నెంబర్.323 లేదా మోడల్ చెక్‌లిస్ట్ పేజీ నెంబర్.46ను ప్రిసైడింగ్ అధికారులు చూసుకోవాలి. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ల నెంబర్లు నోట్ చేసి పెట్టుకోవాలి. వీటి నెంబర్లతో పాటు సూట్‌కేస్ నెంబర్లతో ట్యాలీ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. మార్క్ చేసిన ఓటర్ల జాబితా పేజీలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా దాని మీద సంబంధిత రిటర్నింగ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కాబట్టి వీలైతే అక్కడే మాక్ పోలింగ్ లాగా పరీక్ష చేయాలి. పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు, వారి పేర్లు సరి చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment