సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. ఈ నెల 7న జరిగే ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించడానికి ముందస్తు కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక ప్రగతిభవన్‌లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ ‘ప్రెస్‌మీట్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్‌తో పాటు కామారెడ్డి ప్రాంతానికి చెందిన బాన్సువాడ నియోజకవర్గానికి కూడా జిల్లా నుంచే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
అన్ని రకాల ఏర్పాట్లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక లఘు చిత్రాన్ని కూడా రూపొందించినట్లు తెలిపారు. ఇటు ఓటర్లకు ఓటు హక్కుపై అలాగే ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించాలమని, మొబైల్ వాహనాలు కూడా క్షేత్రస్థాయిలో సంచరించినట్లు చెప్పారు. అనుకున్నదానికంటే ఎక్కువగానే ప్రజల్లో అవగాహన వచ్చిందన్నారు. పోలింగ్‌కు ఇంకా ఒక రోజు సమయం ఉన్నందున జిల్లా కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బందిని తరలించడానికి వాహనాలు సరిపడా ఉన్నాయన్నారు. పోలింగ్ సమయంలో ఈవీఎంలలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి, వాటిని రీప్లేస్‌మెంట్ చేయడానికి, పోలింగ్ రిపోర్టులను సేకరించడానికి 143 సెక్టార్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే నియోజకవర్గం వారీగా కూడా బీఈఎల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు. అలాగే 144 మంది మైక్రో పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 25, స్టాటిక్ సర్వైర్వల్ బృందాలు 25, ఎంసీసీ బృందాలు 25 ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత పాలిటెక్నిక్ కళాశాలలో కౌటింగ్ నిర్వహణకు 102 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బందోబస్తుగా జిల్లాలో 1100లకు పైగా పోలీసు సిబ్బంది ఉండగా, అదనంగా 600 మంది హోంగార్డులు, పారామిలిటరీ, బీఎస్‌ఎఫ్ దళాలు వచ్చాయని చెప్పారు.
దివ్యాంగుల కోసం...
అలాగే ప్రత్యేకంగా ఈసారి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం రవాణా సౌకర్యం, అక్క డి నుంచి సులభంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి వీల్ చైర్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 440 వీల్‌చైర్‌లను తెప్పించామని, దివ్యాంగులను పోలింగ్ బూత్‌లోనికి తీసుకెళ్లడానికి సహాయకులుగా వలంటీర్లను నియమించినట్లు తెలిపారు. వీరికి ప్రత్యేకమైన టీ షర్టులు కూడా అందజేస్తున్నామన్నారు. మూగ, చెవిటి వారికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి సైన్ లాంగ్వేజీ శిక్షణ పొందిన వారిని అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. అంధులు ఓటు వేసేందుకు వారికోసం బ్యాలెట్ యూనిట్‌లో బ్రెయిలీ లిపిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
ఎన్నికల్లో ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు. ఓటర్లు వారికి నచ్చిన వారికి నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేయాలని, వజ్రాయుధం లాంటి ఓటుహక్కును అమ్మకోవద్దన్నారు.
మద్యం, నగదు సీజ్ చేశాం
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ డబ్బు, మద్యం రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌టీ అధికారుల బృందాలు వాహనాలను తనిఖీ చేస్తున్నారని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ. 70 లక్షల 61వేల నగదు పట్టుకుని సీజ్ చేశామన్నారు. అదే విధంగా 16,254 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నామని, దీని విలువ రూ. 43లక్షల 42వేలుగా ఉందన్నారు.
338 సమస్యాత్మక ప్రాంతాలు
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు కలిపి 1433 ఉన్నాయన్నారు. 338 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించగా, ఈ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ లేదా వీడియోగ్రఫీ ఏర్పాటు చేసి నిరంతరంగా రికార్డు చేస్తున్నామన్నారు.
సమాచారమివ్వండి
ప్రచార సమయం ముగిసిన తరువాత కూడా అభ్యర్థులు ఎవరైనా ప్రచారం నిర్వహించినా, పార్టీల నాయకులు డబ్బులు, మద్యం పంచినా ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. పోలింగ్‌కు ఇంకా ఇంకా ఒక్క రోజు సమయం ఉన్నందున ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఎక్కువ జరిగే ఆస్కారం ఉన్నందున నిఘా బృందాలను కూడా అప్రమత్తం చేశామన్నారు. కోడ్‌ను ఉల్లంఘిచే పనులు చేస్తే కాల్ సెంటర్‌కు, లేదా నేరుగా అధికారులకు సమాచామివ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment