కాంగ్రెస్ పార్టీ లో చేరిన నేతలతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం పెడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు సీఎంగా ఉన్నా.. తాను కీలకంగా వ్యవహరించి రుణమాఫీ చేయిస్తానని హామీఇచ్చారు. నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామంలో వివిధ పార్టీ లకు చెందిన 200 మంది శనివారం ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా 14 గంటల కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రంలో భూములు అమ్మడంతో పాటు వైన్‌షాపులకు ముందస్తుగానే టెండర్లు వేసి వచ్చిన డబ్బులను సీఎం కేసీఆర్ తమ ఖాతాలో జమ చేసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో తనను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లను గెలుచుకుంటామని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ జూలకంటి వెంకట్‌రెడ్డి, నాయకులు చెల్ల పద్మారెడ్డి, బ్రహ్మచారి, చెలక సైదిరెడ్డి, ఎం.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment