నల్లగొండ: తెలంగాణ కోసం 1,200 మంది అమరులైతే ఆ కుటుంబాలందరికీ కేసీఆర్ ఎందుకు ఉద్యోగం కల్పించలేదని నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన నాడు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ సోనియా గాంధీ కాళ్లు మొక్కారని, నేడు ఆమెను బలి దేవత అంటున్నాడని, 1,200 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాతనే తెలంగాణ ఇచ్చిందనడం దురదృష్టకరమన్నారు. మంగళవారం ఆయన వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అనంతరం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి ఎలాంటి పదవి ఇవ్వలేదని విమర్శించారు. నిధులు, నీరు, నియామకాలు పేరిట ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యోగ కల్పనలో బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ చేస్తారనుకుంటే బాధల తెలంగాణ చేశాడని, ఒకటో తేదీ జీతాలు రావడం లేదని, కట్టిన ప్రాజెక్టులు నాణ్యత లేక కూలిపోతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారంటీ స్కీమ్‌లను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్, అదే రోజు కేసీఆర్ రాజీనామా చేస్తాడని చెప్పారు. ‘డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించిన రోజే కాదు.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తోంది. ప్రతి హామీని నెరవేరుస్తుంది’అని చెప్పారు.
ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది..
‘ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం అవుతాడు. మీకున్న తొందర నాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు సీఎం కావల్సిన అవసరం లేదు’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సభలో ప్రజలంతా సీఎం.. సీఎం అని నినాదాలు చేయగా కోమటిరెడ్డి పైవిధంగా స్పందించారు.
‘నా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టిచ్చి నా తక్కువే. 20 ఏళ్లుగా నన్ను ఎంతో పెద్ద నాయకుడిని చేసి గుర్తింపు తెచ్చారు. ఒక్క పిలుపుతోనే నా నామినే షన్‌కు వేలాదిగా తరలి వచ్చారు. నా జన్మ ధన్యమైంది. మీ కోసం ఏ త్యాగాల కైనా సిద్ధమే’అని కోమటిరెడ్డి భావోద్యేగానికి గురైయ్యారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment