సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల పేరిట సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పథకాల విషయంలో కేసీఆర్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ‘‘రైతుబంధు అందరికీ ఇవ్వలేదు.. 24 గంటల కరెంటు అంతా ఉత్తిమాటే.. అందరికీ ఇళ్లు కూడా వట్టిమాటలే.. దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేశారు.
ఇక ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ్ కేసీఆర్.. టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే కేసీఆర్ దుకాణం బంద్ అయింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వం, ఉద్యోగ అర్హత పరీక్షల పేపర్లు లీక్ చేసే ప్రభుత్వం ఉంది. ఈ కుంభకోణాల ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది..’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు కావస్తోందని గుర్తు చేశారు.
2014లో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి స్వాతంత్య్రం ఇస్తే.. ఇప్పుడు కేసీఆర్ అవినీతి పాలననుంచి విముక్తి కల్పించేందుకు మరోసారి తెలంగాణ గడ్డకు వచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని.. అందుకోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వంద సీట్లలో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment