కేసీఆర్‌ పాపాల వల్లే కరువు | Komatireddy Venkat Reddy Comments On KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాపాల వల్లే కరువు

Published Sat, Mar 30 2024 5:37 AM | Last Updated on Sat, Mar 30 2024 5:37 AM

Komatireddy Venkat Reddy Comments On KCR - Sakshi

యాదగిరిగుట్ట పేరు మార్చి మొదటి తప్పు చేశారు: కోమటిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలే. గొర్రెలు, చేప పిల్లల పంపిణీలో కూడా అవినీతి చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల్లోనూ అవినీతే. దళితబంధుకూ కమీషన్లు తీసుకున్నారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే ఆయన చేసిన మొదటి తప్పు. దేవుడి పేరుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సర్వనాశనం చేశారు. ఇలాంటి కేసీఆర్‌ పాపాల వల్లనే ఇప్పుడు కరువు వచ్చిది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

ఒక్కో పెయింటింగ్‌ రూ. 3–4 కోట్లు 
‘నేను ఎన్నో దేశాలు చూశా. కానీ ప్రగతిభవన్‌ లాంటి ఖరీదైన నిర్మాణం ఎక్కడా చూడలేదు. అక్కడ బాత్‌రూంను ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. ప్రగతిభవన్‌లోని ఒక్కో పెయింటింగ్‌ ఖర్చు రూ. 3–4 కోట్లుంటుంది. 20 ఏళ్లు అధికారంలో ఉంటామని అనుకొని కేసీఆర్‌ అలా కట్టించుకున్నారు. ఈ అవినీతి రావుల కోసం ఇప్పుడు జైళ్లు సరిపోవు. ప్రగతి భవన్‌ను జైలు చేసినా సరిపోదేమో. అధికారం పోయేసరికి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మాతో 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తరచూ మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ అవినీతి అంతా బయటకు తీయాలంటే మాకు 20 ఏళ్లు పట్టేట్టు ఉంది’అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. 

ఎంపీగా దానం పోటీ కష్టమే.. 
దానం నాగేందర్‌ ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి మరో పారీ్టలో ఎంపీగా పోటీ చేయడం కష్టమని, అ లా చేస్తే న్యాయ సమస్యలు వస్తాయని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని గతంలో కడియం శ్రీహరి అన్నప్పటికీ ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకున్నట్లు ఉన్నార ని చెప్పారు. తనతో కడియం మాట్లాడలేదని, కేకే మాత్రం మాట్లాడారని, ఆయన్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అభిప్రాయడ్డారు. ఫోన్‌ ట్యా పింగ్‌ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని, ఆయనకు చట్టప్రకారం పదేళ్ల జైలు శిక్ష తప్పదని కోమటిరెడ్డి హెచ్చరించారు.

వైఎస్‌ వల్లే వేగంగా హైదరాబాద్‌ అభివృద్ధి
హైదరాబాద్‌కు కళ ఓఆర్‌ఆర్‌ అని... అది కట్టింది వైఎస్‌ హయాంలోనేనని కోమటిరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ ప్లానింగ్‌ వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. దక్షిణాదిలోనే ఎక్కువ మెజారిటీ నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు వస్తుందని జోస్యం చెప్పారు. తనకు, తన సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మధ్య విభేదాలున్నాయన్న వార్తలను ఖండించారు. తమను విడదీయడం ఎవరి వల్లా కాదని... అయితే బ్రదర్స్‌ పేరు చెబితేనే సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అని, అందుకే తమపై రూమర్స్‌ పుడుతుంటాయని చెప్పారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement