ఖరీఫ్‌లో కష్టాల సేద్యం
- సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీలో వ్యవసాయశాఖ జాప్యం
- అధిక ధరలకు విత్తనాలు కొంటున్న రైతులు
- రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
- రాష్ట్ర విభజన, రుణమాఫీ పథకంతో ‘సహకారం’ నిల్
సాక్షి, తిరుపతి: జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతుల అగచాట్లు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలుగానీ, రుణాలుగానీ అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఖరీఫ్‌లో జిల్లాలో ప్రధాన పంట అయిన వేరుశెనగ విత్తనాలు ఇప్పటి వరకు జిల్లాకు చేరుకోలేదు. ఇంకా కొంత సమయం పడుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో సబ్సిడీ విత్తనాల కోసం ఎదురుచూడలేక రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి విత్తన కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతు ల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిన్నటివరకు వేరుశెనగ విత్తనాలు కిలో రూ.33 ఉండగా, శుక్రవారం పది రూపాయలు పెంచి అమ్మకాలు సాగించినట్టు రైతులు చెబుతున్నారు.
దీంతో వేరుశెనగ రైతులు పంటల సాగు ప్రారంభంలోనే పెట్టుబడులపై ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో వేరుశెనగ సాధారణ విస్తీర్ణం 1,36,400 హెక్టార్లు. ఇందుకోసం లక్షా ఐదు వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలు అవసరమవుతాయి. అయితే ఇప్పటివరకు ఒక్క గింజ కూడా పంపిణీ జరగలేదు. విత్తన కాయల రేటుకు సంబంధించి నోడల్ ఏజెన్సీ లు, అధికారుల మధ్య అవగాహన కుదరలేదు.
దీంతో సబ్సిడీ విత్తనాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. ఒక వైపు సీజన్ ముంచుకొచ్చినా అధికారులు మాత్రం రేటు పేరుతో జాప్యం చేస్తున్నారు. జిల్లాలోని పడమటి మండలాల రైతులు మాత్రం సబ్సిడీ విత్తనాల కోసం వేచి చూడకుండా తమ దగ్గర ఉన్న విత్తన కాయలు, ప్రైవేటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, కుప్పం తదితర ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. రుతుపవనాలు ప్రవేశించే సమయం ఆసన్నం కావడంతో ఇప్పటికే భూమిలో ఉన్న తేమ ఆరిపోకుండా నాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
బ్యాంకులకు వెళితే రైతులపై చిన్నచూపు
రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందు కు రావడం లేదు. దీంతో పాత రుణాలు తీర్చలేక కొత్త అప్పు పుట్టక లబోదిబోమనే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ప్రతిఏటా ఈ పాటికి రుణాల మంజూరు జరిగేది. కానీ ఈ ఏడాది రుణమాఫీ పథకంతో కొత్తగా అప్పులు ఇచ్చేం దుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు.
కొత్త రుణా ల మంజూరుకు సంబంధించి ఇంకా స్పష్టత రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. ఈ ఏడాది మార్చి వరకు జాతీయ బ్యాంకులు రూ. 7,660 కోట్ల రుణాలు ఇచ్చాయి. సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు ఈ రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు రూ. 1,500 కోట్లు ఇచ్చారు. వీటి సంగతి తేల్చకుండా కొత్తగా రుణాలు ఎలా ఇస్తామంటూ బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
సహకారం నిల్
జాతీయ బ్యాంకుల పరిస్థితి అలా ఉంటే సహకార బ్యాంకులు పూర్తిగా చేతులెత్తేశాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే రుణాల మంజూరు నిలిపివేయాలని సహకార బ్యాంకులను ఆప్కాబ్ ఆదేశించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఒక్క రూపా యి కూడా రైతులకు రుణం మంజూరు చేయలేదు. ఈ ఏడాది మార్చి వరకు రూ. 200 కోట్లు స్వల్ప కాలిక రుణాలు, మరో రూ. 70 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేసి ఉన్నారు.
ఇవి కాకుండా మరో పది కోట్ల రూపాయలు బంగా రు నగలపై వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆప్కాబ్ ఆదేశాల మేరకు కొత్త రుణాలు ఇచ్చేందుకు సహకార బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో భారీ మొత్తంలో ఇప్పటికే ఇచ్చిన రుణాల సంగతి తేల్చకుండా కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితిలో సహకార బ్యాంకులు లేవని అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఇన్ని అవరోధాల నడుమ ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవస్థలు దయనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది.