19 రకాలు రెడీ చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం
రైతులకు విక్రయించేందుకు రేపు మేళా
వర్సిటీ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
రూ.500 బోనస్ ప్రకటనతో రైతాంగం ఎదురుచూపులు
దొడ్డు గింజలతో పాటు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, సోయా విత్తనాలూ రెడీ
సాక్షి, హైదరాబాద్: సన్న రకం ధాన్యానికే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వానాకాలం సీజన్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ సన్న రకాల విత్తనాలను రైతులకు అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. మరోవైపు సన్నాలతో పాటు రైతులకు వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం (24న) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
మేళాలో వ్యవసాయ వర్సిటీతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు ఐఐఓఆర్, ఐఐఎంఆర్,ఐఐఆర్‌ఆర్, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖలు టీఎస్‌ఎస్‌డీసీ, ఎన్‌ఎస్‌సీ, టీఎస్‌ఎస్‌ఓసీఏలు పాల్గొననున్నాయి. అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు (జగిత్యాల, పాలెం, వరంగల్) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, అలాగే వర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా విత్తన మేళా నిర్వహించనున్నారు.
వర్సిటీ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభం కానుంది. విత్తనాలతో పాటు వర్సిటీ రూపొందించిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు రైతుల కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంటాయి. మొత్తం 16 పంటలకు సంబంధించిన 67 రకాల విత్తనాలు కూడా ఉంటాయి. మేళాలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్టి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించటానికి వీలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలతో కూడిన వ్యవసాయ ప్రదర్శన కూడా 24న నిర్వహిస్తున్నారు.
ఈ 19 రకాలకే బోనస్?
విత్తన మేళాలో వ్యవసాయ వర్సిటీలో రూపొందించిన 19 రకాల సన్న వరి విత్తనాలు విక్రయిస్తారు. బి.పి.టి. 5204, డబ్ల్యూ.జి.ఎల్–44, డబ్ల్యూ.జి.ఎల్ –962, డబ్ల్యూ.జి.ఎల్. 1119, డబ్ల్యూ.జి.ఎల్.1246, డబ్ల్యూ.జి.ఎల్ 1487, ఆర్.డి.ఆర్ 1162, ఆర్.డి.ఆర్ 1200, కె.ఎన్.ఎం 1638, కె.పి.ఎస్. 6251, జె.జి.ఎల్– 28545, జె.జి.ఎల్ 27356, జె.జి.ఎల్ 33124, ఆర్.ఎన్.ఆర్.15435, ఆర్.ఎన్.ఆర్– 2465, ఆర్.ఎన్.ఆర్– 11718, ఆర్.ఎన్.ఆర్. 21278, ఆర్.ఎన్.ఆర్. 29325, ఆర్.ఎన్.ఆర్. 15048 రకాలు అందబాటులో ఉంటాయి. అయితే ఈ 19 రకాల సన్న రకం విత్తనాలకే రూ. 500 బోనస్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. పైగా ఇవి వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేసినవి కావడంతో ప్రభుత్వం వీటినే సిఫారసు చేస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. రైతులను సన్నాల వైపు మళ్లించాలన్న ఆలోచనతోనే బోనస్ ప్రకటించిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు.
8 రకాల దొడ్డు విత్తనాలు
దొడ్డు గింజలకు సంబంధించి 8 రకాలు.. ఆర్.ఎన్.ఆర్–28361, ఆర్.ఎన్.ఆర్. 15459, కె.ఎన్.ఎం 118, ఎమ్.టి.యు. 1010, డబ్ల్యూ.జి.ఎల్– 915, జె.జి.ఎల్ 24423, జె.జి.ఎల్ 28639 అందుబాటులో ఉంచుతారు. సువాసన కలిగిన రకం ఆర్.ఎన్.ఆర్–2465 కూడా విక్రయిస్తారు. ఇక మొక్కజొన్నలో 5 హైబ్రిడ్లు డి.హెచ్.యం 117, డి.హెచ్.యం 121, బి.పి.సి.హెచ్. 6, కరీంనగర్ మక్క, కరీంనగర్ మక్క–1 ఉంటాయి. జొన్నలో పి.వై.పి.ఎస్–2, సి.ఎస్.వి–41, రాగిలో పి.ఆర్.ఎస్.38, ఆముదంలో పి.సి.హెచ్. 111, నువ్వుల్లో జె.జి.యస్–1020, వేరుశనగలో ధరణి విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది.
అలాగే అపరాలకు సంబంధించి పెసరలో డబ్ల్యూ.జి.జి 42, ఎమ్.జి.జి 295, ఎమ్.జి.జి 347, ఎమ్.జి.జి 385, మినుములో యం.బి.జి. 1070, కందిలో 8 రకాలు.. హనుమ, డబ్ల్యూ.ఆర్.జి.ఇ– 97, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–93, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–121, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–255, పి.ఆర్.జి–176, టి.డి.ఆర్.జి–59, ఆశ అందుబాటులో ఉంచుతారు. సోయా చిక్కుడులో 4 రకాలు.. బాసర, కె.డి.ఎస్–726, ఎం.ఎ.యు.యస్–612, ఎ.ఐ.ఎస్.బి–50తో పాటు పశుగ్రాస పంటల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment