వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతాంగం
ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు
సీజన్ ప్రారంభమైనట్టేనన్న వ్యవసాయ శాఖ
1.34 కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా
అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఈసారి ఏకంగా 60 లక్షల ఎకరాల్లో పత్తి!
ఎరువులు సిద్ధం:మార్క్‌ఫెడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. మరికాస్త వర్షం పడితే చాలు వెంటనే విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడం, వచ్చే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. వానాకాలం వ్యవసాయ సీజన్ గతం కంటే ముందుగా ప్రారంభమైనట్లేనని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది.
గతేడాది వానాకాలం సీజన్‌లో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపింది. గతేడాది వరి 65 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. ఈసారి పత్తి మరో 15.23 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా రైతులను ప్రోత్సహించనున్నారు. వరి కంటే ఎక్కువగా పత్తిని ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విత్తన ప్రణాళిక ఖరారు
సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్‌కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అందులో అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు, సోయాబీన్ విత్తనాలు 1.49 లక్షల క్వింటాళ్లు అందుబాటులోకి తెస్తారు.
మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు. అలాగే జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేయగా, మరికొందరు విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మార్క్‌ఫెడ్ వెల్లడించింది.
వ్యవ‘సాయానికి’సన్నాహాలు
ఈ వానాకాలం సీజన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు స్థానంలో రైతుభరోసా ద్వారా పెంచిన పెట్టుబడి సాయం అందజేయనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనుంది. అయితే సాగయ్యే భూములకే ఇవ్వాలని, సీలింగ్ విధించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇక రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు దశలో ఉన్నాయి. మరోవైపు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు పంటల బీమాను కూడా పునరుద్ధరించనున్నారు.
33 మందిపై కేసులు: మంత్రి తుమ్మల
అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి రూ. 2 కోట్ల విలువగల 118.29 క్వింటాళ్ళ విత్తనాలను స్వా«దీనం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసి ఇద్దరు డీలర్లపై కేసులు పెట్టామని వెల్లడించారు.
పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ అ«దీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యక్తులు, మోసగాళ్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇప్పటివరకు 84.43 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేశామని, అందులో రైతులు ఇప్పటికే 25.10 లక్షల ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేశారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment