ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం నుంచి మూడోవంతే సరఫరా
మంత్రి తుమ్మల కేంద్రానికి విన్నవించినా.. ఇదే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీఏపీ కొరత నెలకొంది. ఫలితంగా కీలకమైన వానాకాలం పంటల సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు పుంజుకుంటున్న తరుణంలో కొరత ఏర్పడటంతో అనేక చోట్ల డీఏపీ బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్నిచోట్ల అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 43 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేసింది. దీంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గత నెల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి జె.పి.నడ్డాకు ఎరువుల కేటాయింపుల పెంపుపై లేఖ రాశారు.
జూలై నెలలో 80 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్పందించి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎరువులను, ముఖ్యంగా డీఏపీని కేటాయిస్తామని హామీయిచ్చారని అప్పట్లో తుమ్మల తెలిపారు. అయితే ఇప్పుడు డీఏపీ సరఫరాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సీజన్‌లో కావాల్సిన డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు
ఈ వానాకాలం సీజన్‌కు 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. యూరియాతోపాటు డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకే 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 60 వేల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ లక్ష టన్నులు రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
ఆ క్రమంలోనే అత్యధికంగా మే, జూన్ నెలల్లో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు కేటాయించారు. అంటే ఆ రెండు నెలలకే 9.20 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. కానీ కేంద్రం నుంచి డీఏపీ సరైన సమయానికి రాలేదు. ఏప్రిల్, మే నెలలకు కేటాయించాల్సిన దాంట్లో కేవలం మూడో వంతే రాష్ట్రానికి సరఫరా అయింది.
ఈ విషయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ సరిగ్గా పర్యవేక్షణ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులను అధికారులు మభ్యపెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment