తమకు మాఫీ జరగలేదంటూ ఫిర్యాదుల వెల్లువ
గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో ఫిర్యాదులు
ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో లాంటి వారికి వినతులు
అనేకచోట్ల వ్యవసాయాధికారులను నిలదీస్తున్న రైతులు
మరోవైపు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
తమకు రూ. లక్షలోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ ఆరా.. సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు.. కారణాలు తెలియవని స్పషీ్టకరణ
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి జరగని రుణమాఫీ
రేషన్‌కార్డు, పీఎం కిసాన్ నిబంధనలే కారణమనే అనుమానం
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో స్థాయి అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచి్చనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేకచోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ జరగలేదంటూ నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గానీ, బ్యాంకర్ల నుంచి గానీ సరైన సమాధానం రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఎందుకు రాలేదో తమకు తెలియదంటున్నారని వాపోతున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో తమకూ అంతుబట్టడం లేదని అధికారులంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్‌కార్డు లేకపోవడం వంటివే అనేకమంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతుండగా, దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. దాదాపు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే..
ఖమ్మం జిల్లాలో 20 శాతం నుంచి 30 శాతం లోపుగానే లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా లక్ష మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను అడిగారు.
టోల్‌ప్రీ నంబర్లు ఏర్పాటు
ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ఖమ్మం కలెక్టరేట్‌లో 1950తో పాటు 90632 11298 టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఐటీ పోర్టల్, మండల స్థాయిలో సహాయ కేంద్రాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
ఎవరూ పట్టించుకోవడం లేదు
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్‌లో మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.70 వేల పంట రుణం తీసుకున్నా. దానిని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంకు అధికారులు తిరిగి రూ.85 వేల రుణం ఇచ్చారు. ఈ రూ.85 వేల రుణం మాఫీ కాలేదు. నాక్కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – అజీ్మర వెంకన్న, దామ్యతండా, మహబూబాబాద్ మండలం
నాతోటి వ్యక్తికయ్యింది..నాకు కాలేదు
నాకు తడ్కల్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.42 వేల పంట రుణం ఉంది. ఏటా లోన్‌ను రెన్యువల్ చేస్తున్నా. ఈసారి నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకొన్న వారి పేరు రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయాధికారులను అడిగినా ఏమీ చెప్పడం లేదు. – కొండాపురం పెద్దగోవింద్‌రావు, బాన్సువాడ, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా
అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో సుమారు 42 వేల మంది రైతులు లక్ష లోపు రుణమాఫీ అర్హులు. వీరికి రూ.162 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 19,542 మంది రైతులకు రూ.75 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే కేవలం 45 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 51,417 మంది ఉండగా.. వీరికి రూ.236.54 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.
కానీ 20,130 మంది రైతులకు రూ.92.02 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. దీంతో మాఫీకాని వారు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా, 33,913 మందికి సంబంధించిన రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారికి మాఫీ జరగలేదు. ఇక వరంగల్ డీసీసీబీ పరిధిలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 57,129 మంది కాగా 23,841 మంది రైతుల ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమైంది. దీంతో మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment