విద్యుత్ బకాయిలు మాఫీ
► గ్రేటర్‌లో నెలకు 100 యూనిట్లలోపు కేటగిరీకి వర్తింపు.. జీవో జారీ
► రూ. 52.42 కోట్ల బకాయిలు రద్దయ్యే అవకాశం
► రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బకాయిలపై అపరాధ రుసుము కూడా మాఫీ
► మార్చి 31లోగా అసలు బిల్లులు చెల్లిస్తే వర్తింపు
► ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో నెలకు 100 యూనిట్లలోపు వినియోగానికి సంబంధించిన విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ బకాయిల మొత్తం రూ.52.42 కోట్లను ప్రభుత్వమే విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు చెల్లించనుంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గృహ, ప్రభుత్వ కార్యాలయాలు, సేవల కేటగిరీల్లో డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యుత్ బిల్లుల బకాయిలపై అపరాధ రుసుమును కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
అయితే ఈ వినియోగదారులంతా వచ్చే మార్చి 31లోగా బకాయిల సొమ్మును చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ బిల్లుల బకాయిలపై ప్రతి నెలా 1.5 శాతం అపరాధ రుసుము విధిస్తుండడంతో... రాను రాను అసలు బకాయిలతో పోల్చితే అపరాధ రుసుమే ఎక్కువవుతోంది. అలాంటివారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. ఇక వచ్చే ఏప్రిల్ 1వ తేదీలోగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆయా శాఖల ఖర్చుతోనే ‘ప్రీపెయిడ్’ విద్యుత్ మీటర్లను బిగించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు, స్థానిక సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్ల ద్వారానే బిల్లింగ్ జరపాలని డిస్కంలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని ఆయా శాఖల నుంచే మూడు విడతల్లో వసూలు చేయాలని సూచించింది. ప్రీపెయిడ్ మీటర్ల రీచార్జి, ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి గడువులోగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు నుంచి నీటి సరఫరా, వీధి దీపాల కేటగిరీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
జీహెచ్‌ఎంసీలో 3.69 లక్షల వినియోగదారులకు లబ్ధి
విద్యుత్ బకాయిల మాఫీతో హైదరాబాద్‌లో వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే దాదాపు 3.69 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగనుంది. వంద యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించిన వినియోగదారులు కూడా తమ పెండింగ్ బిల్లులను మార్చి 31లోగా చెల్లిస్తే అపరాధ రుసుము మాఫీ కానుంది. ఈ నిర్ణయంతో మరో 2.16 లక్షల మంది వినియోగదారులు లబ్ధిపొందే అవకాశముంది.