సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా విద్యుత్ సబ్సిడీని చెల్లించని పక్షంలో విద్యుత్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం వినియోగదారుల నుంచి సబ్సిడీ లేని విద్యుత్ చార్జీలు (టారిఫ్) వసూలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సబ్సిడీ రహిత టారిఫ్‌ను వర్తింపజేయాల్సిందిగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆదేశాలు జారీ చేయాలని ఆయా రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లకు (ఈఆర్సీలకు) సూచించింది.
విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యుత్ సబ్సిడీల విధానంలో కీలక మార్పులను అమల్లోకి తెస్తూ గత జూలై 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా దానిని బహిర్గతం చేసింది. విద్యుత్ నిబంధనలకు రెండో సవరణ–2023 పేరుతో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చా యి. ఇకపై కేంద్రం ప్రకటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆధారంగా ప్రభు త్వం చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు లెక్కించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఎంత సబ్సిడీ చెల్లించకపోతే అంత మోత..
రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం సబ్సిడీతో పోల్చితే వాస్తవంగా చెల్లిస్తున్న సబ్సిడీ తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు భారీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన సబ్సిడీ మేరకు విద్యుత్ చార్జీలను పెంచి వినియోగ దారుల నుంచి వసూలు చేయాల్సిందేనని కేంద్రం ఆదేశించింది.
ఉదాహరణకు గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు యూనిట్‌కు రూ.8 చార్జీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రూ.4 సబ్సిడీ ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం యూనిట్‌కు రూ.2 మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తోంది. దీంతో వినియోగదారులు చెల్లించే రూ.4కు లోటు సబ్సిడీ రూ.2 కలిపి మొత్తం రూ.6కు చార్జీ పెంచుకోవాల్సిందిగా కేంద్రం సూచించింది. ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ పూర్తిగా చెల్లించని పక్షంలో రూ.8 వసూలు చేసుకోవాలని ఆదేశించింది.
ఇకపై సబ్సిడీల వివరాలతో త్రైమాసిక నివేదికలు
కేంద్రం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పూర్తి స్థాయిలో విద్యుత్ సబ్సిడీలను ఎప్పటికప్పుడు ముందస్తుగా డిస్కంలకు చెల్లించకతప్పని పరిస్థితి నెలకొంది. కాగా కేటగిరీల వారీగా వినియోగదారులు వాడిన విద్యుత్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ సబ్సిడీలను కచ్చితంగా లెక్కించడానికి కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది.
కేటగిరీల వారీగా ఓ త్రైమాసికంలో సబ్సిడీ వినియోగదారులు ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు? ప్రతి యూనిట్ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ఎంత? రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చెల్లించిన సబ్సిడీ ఎంత? ఇంకా రావాల్సిన సబ్సిడీ బకాయిలు/లోటు ఎంత? తదితర వివరాలతో రాష్ట్రాల ఈఆర్సీలు త్రైమాసిక నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది.
ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా ఈఆర్సీకి డిస్కంలు ఈ మేరకు వివరాలతో ఓ నివేదికను సమర్పిస్తాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన సవరణలతో 30 రోజుల్లోగా ఈఆర్సీ తుది త్రైమాసిక నివేదికను ప్రకటిస్తుంది. నిబంధనల మేరకు విద్యుత్ సబ్సిడీ అకౌంటింగ్ జరగలేదని, సబ్సిడీల కోసం ప్రభుత్వానికి బిల్లులు పంపించలేదని తేలితే డిస్కంలోని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని ఈఆర్సీలను కేంద్రం ఆదేశించింది.
ప్రభుత్వం చెల్లించకుంటే.. ప్రజల నుంచి వసూలు చేయాల్సిందే
Published Tue, Sep 5 2023 1:19 AM | Last Updated on Tue, Sep 5 2023 1:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment