విద్యుత్ సంస్థల పిటిషన్లపై నేటి నుంచి బహిరంగ విచారణలు షురూ
రూ.963 కోట్ల జెన్‌కో ట్రూఅప్ చార్జీలపై నేడు, రూ.16,346 కోట్ల ట్రాన్స్‌కో ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలపై రేపు విచారణ
ఈ ఏడాది రూ.1,200 కోట్ల మేర చార్జీల పెంపుపై 23, 24న విచారణ.. ఈ నెల 29న ఈఆర్సీ పదవీకాలం ముగింపు ముందే వెలువడనున్న కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేలా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు బహిరంగ విచారణలు నిర్వహించనుంది. మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండగా, ఈలోపే ఆయా పిటిషన్లపై ఈఆర్సీ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. నిర్దేశిత గడువుకి చాలా ఆలస్యంగా విద్యుత్ సంస్థలు పిటిషన్లు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్‌లోపే విద్యుత్ సంస్థలు పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, గత నెలలో దాఖలు చేశాయి.
ఒకేసారి పెద్ద సంఖ్యలో దాఖలైన పిటిషన్లను చదివి రాతపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించడానికి సమయం సరిపోదని, గడువు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ)తో పాటు విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల్ రావు తదితరులు చేసిన విజ్ఞప్తులను ఈఆర్సీ తోసిపుచ్చింది. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు వరుసగా ఐదు రోజుల పాటు హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో బహిరంగ విచారణలు నిర్వహించనుంది. ఆ తర్వాత 4 రోజుల పదవీకాలం మిగిలి ఉండగా కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే గడువులోగానే విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున రాతపూర్వక అభ్యంతరాలు ఈఆర్సీకి అందాయి. కాగా ఈఆర్సీ తీసుకోనున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి..
జెన్‌కో ట్రూఅప్ చార్జీల భారం రూ.963 కోట్లు
తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్‌ను గత నెల 21న దాఖలు చేసింది. వీటిపై సోమవారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. జీటీఎస్ కాలనీలోని విద్యుత్ నియంత్రణ్ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ ధరలు/చార్జీలతో పోల్చితే వాస్తవ ఆదాయంలో వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో విద్యుత్ సంస్థలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక వేళ ఆదాయ లోటు ఉంటే భర్తీ చేసుకోవడానికి ఎంత మేరకు ట్రూఅప్ చార్జీలను వసూలు చేయాలో ఈఆర్సీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. జెన్‌కో విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు చేసి తమ వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెన్‌కో ప్రతిపాదించిన రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసుకోవడానికి జెన్‌కో అనుమతి కోరింది. విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా ఈ ట్రూప్ చార్జీల భారాన్ని డిస్కంలు విద్యుత్ వినియోగదారులపై మోపుతాయి.
ఐదేళ్లలో రూ.16,346 కోట్ల ఆదాయ అవసరాలు
తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై మంగళవారం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఇక సిరిసిల్ల జిల్లాకు విద్యుత్ సరఫరా చేసే కోఆపరేటివ్ ఎలక్రి్టక్ సప్లై లిమిటెడ్ (సెస్) పరిధిలో రూ.5 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన ఏఆర్‌ఆర్ 2024–25, 2024–29 ఎంవైటీ పటిషన్‌పై ఈ నెల 25న సిరిసిల్లలో విచారణ జరగనుంది.
నవంబర్ 1 నుంచి పెరగనున్న చార్జీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) దాఖలు చేసిన రెండు వేర్వేరు ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మరో రెండు ఎంవైటీ పిటిషన్లపై బుధవారం హైదరాబాద్‌లో, గురువారం నిజామాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు, లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారికి ఫిక్స్‌డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారుల నుంచి ఫిక్స్‌డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment