రుణమాఫీ మాయరా.. సూరయ్య.. | Surayya Marais waiver .. .. | Sakshi
Sakshi News home page

రుణమాఫీ మాయరా.. సూరయ్య..

Published Fri, Jul 18 2014 1:29 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

రుణమాఫీ మాయరా.. సూరయ్య.. - Sakshi

రుణమాఫీ మాయరా.. సూరయ్య..

గ్రామంలో ఏ నలుగురు కలిసినా రుణమాఫీపైనే చర్చ. ఎలక్షన్‌లో నమ్మించి.. ఆ తరువాత నట్టేట ముంచిన చంద్రబాబు వైఖరిపై ప్రతి ఒక్కరూ దుమ్మెత్తి  పోస్తున్నారు. కైకలూరు మండలం ఆళ్లపాడు రచ్చబండ వద్ద గురువారం సాయంత్రం 5 గంటల  సమయంలో కొందరు రైతుల సంభాషణ ఇదీ..
 
రామ్మూర్తి : ఏంటి.. సూరయ్య బావా అంత దిగాలుగా కూర్చున్నావ్.. ఇంట్లో ఎవరికైనా బాగాలేదా ఏంటీ..

సూరయ్య : అదేంలేదు రామ్మూర్తి.. ఇప్పుడే పొలంగాడికి పోయి వత్తున్నా.. రాకరాక చినుకుపడింది.. సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. మన ఊరి ఆసామిని అప్పడిగితే లేదు పొమ్మన్నాడు.
 
రామ్మూర్తి : అయ్యో.. బావా ఎంతకట్టమెచ్చిపడింది.. పోని బ్యాంకోళ్ల కాడికి  పోకూడదూ..

సూరయ్య : అదీ అయ్యింది బావా.. మొన్న పంటకు మీ అక్క సుబ్బలక్ష్మి నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను.. సరిపోక పొలం కాగితాలు పెట్టి మళ్లీ తీసుకున్నాను.. ఇప్పుడేమో ఏవో నోటీసులంటా.. ఇంటికి పంపారు.. తాగడానికి.. గంజినీళ్లే దొరకడం లేదు.. ఇప్పుటికిప్పుడూ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చికట్టేది.. (అంటుండగా కాసులు కాలినడకన వచ్చి ఆగాడు.)
 
కాసులు : ఏంటీ.. బావబామ్మర్దిలిద్దరూ తెగ మాటాడేసుకుంటున్నారు. ఏంటి.. కథ

సూరయ్య : కథా.. కాకరకాయా.. మా క ట్టాలు చెప్పుకొంటున్నాం.. అదును దాటిపోతోంది. కాడి కడతానికి పైసల్లేవ్..
 
కాసులు : అదేంటి సూరయ్య.. మొన్న ఎలచ్చన్లో మనూరొచ్చిన చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారుగా..
 
సూరయ్య : ఆ.. అవును.. అదే నమ్మి ఓటేశాం. ఆయన గారు ముఖ్యమంత్రి కాగానే రుణాలు రద్దుచేసి.. బ్యాంకోళ్లు డబ్బు లిత్తారని ఎదురుచూశాం. తీరా ఓటు దాటిన తర్వాత గేటు మూసినట్లుగా ఉంది పరిస్థితి. అదేదో రీషెడ్యూలంటా.. అది కూడా  కిందటేడాది ఆరు నెళ్లకేనంటా..
 
కాసులు : నీవు చెప్పేది నిజమే సూరయ్య. కమిటీ అంటూ ఓ 40 రోజులు గడపుకొచ్చారు.. తీరా రీషెడ్యూలంటా మెలిక పెట్టారు. ఇదే జరిగితే మనకు పావలా వడ్డీ ఏమో గానీ, 13 శాతం వడ్డీతో పాటు చక్రవడ్డీ, బారువడ్డీలో బ్యాంకోళ్లు మన ఆస్తుల్ని గింజేసుకుంటారు. ఇంకో విషయం తెలుసా.. మనం బ్యాంకులో తనఖా పెట్టిన పొలం దస్తావేజులు ఇవ్వరంటా. మన పిల్లల పెళ్లిళ్లకు అవసరమయ్యి పొలం అమ్ముదామన్నా ఇక కుదరదు. అది సరే గానీ రామ్మూర్తీ ఎలచ్చన్ల ముందు హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలీయదా ఏంటీ..
 
రామ్మూర్తి :
అవును కాసులు.. ఏదో విధంగా గద్దెనక్కెమా లేదా అన్నట్టుగానే ఉంది వీళ్ల తీరు. లేదంటే ఏంటీ.. మనకు రుణాలు మాఫీ చేస్తే పొరుగు రాష్ట్రాలు ఊరుకోవంటా. వాళ్లు కూడా అడుగుతారంటా. ఇది ముందు తెల్వదా వాళ్లకు. అంతెందుకు.. మాది ఉమ్మడి కుటుంబం. మా తమ్ముడు, అన్న కూడా రుణాలు తీసుకున్నారు. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అంటే మా పరిస్థితేంటీ.
 
కాసులు : అదీ సరే గాని రామ్మూర్తీ.. అటుచూడూ.. ఉరుకులు పరుగుల మీద వస్తోందీ.. మన పురుషోత్తమేనా..
 
రామ్మూర్తి :
అవునవునూ.. ఆపండపండీ.. ఏంటీ సంగతి పురుషోత్తం..
 
పురుషోత్తం : ఏం చెప్పమంటారు బాబు. ఆ చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పడంతో మా ఆవిడ శీతాలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం కట్టకుండా, కైకలూరులో కలర్ టీవీ, ఫ్రిజ్, డబుల్‌కాట్ మంచాలు.. ఇంకా ఏవేవో కొనేసింది. దాని  సిగతరగ ఇప్పుడేమో బ్యాంకోళ్లు ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబ్బాబు.. కాస్త మీరైన చెప్పండి.
 
రామ్మూర్తి :
అందరి పరిస్థితి అదేలే.. పదండి ఆ గొడవెంటో చూద్దాం.. అని నలుగురు ముందుకు కదిలారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement