ఎంపీ ముత్తంశెట్టికి చేదు అనుభవం
అనకాపల్లి రూరల్: రుణ మాఫీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూటకో మాట చెబుతున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు బ్యాంకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు ప్రభుత్వం ఎటూ తేల్చని తీరుతో అసహనానికి గురైన పలువురు మహిళలు ఏ విషయం తేల్చాలంటూ ఎంపీని నిలదీశారు.
జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో అధికారులతో ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చాంబర్‌లోకి దూసుకువచ్చిన డ్వాక్రా మహిళలు ‘రుణ మాఫీపై ఏదో తేల్చండి. బకాయిలు తీర్చాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కట్టక పోతే పొదుపు డబ్బు నుంచి మినహాయిస్తున్నారు. మేము రుణాలు తీర్చాలా? వద్దా?’ అంటూ నిలదీశారు. దీంతో అవాక్కయిన ఎంపీ ఏదోలా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కమిటీ వేశారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఈలోగా పట్టణ బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జోక్యం చేసుకుని ‘తన భార్య కూడా డ్వాక్రా మహిళే’ అని అనడంతో అక్కడివారు అవాక్కయ్యారు. వెంటనే సర్దుకున్న ఎంపీ డ్వాక్రా మహిళల్లో డబ్బు న్న వారు కూడా ఉన్నారని, అందువల్ల కేటగి రీగా విభజించి అర్హుల రుణాలే రద్దు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.