muttansetti srinuvasurao
-
పాలిమర్స్ బాధితులకు నష్టపరిహారం
ఆరిలోవ(విశాఖ తూర్పు)/రాజాం/సంతకవిటి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన దుర్ఘటనలో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన 147 మందికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం చెక్కులు అందజేశారు. ఆరిలోవ హెల్త్‌సిటీ అపోలో ఆస్పత్రిలో మంత్రి ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విచారణ కమిటీ రిపోర్టును ఆధారంగా కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే చంద్రబాబు రాజకీయం చేస్తూ బాధితులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు. మెడికో కుటుంబానికి రూ.కోటి అందజేత ఈ ప్రమాదంలో మృతిచెందిన మెడికో విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తల్లిదండ్రులు పద్మావతి, ఈశ్వరరావులకు కూడా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని కావలి గ్రామంలో రూ.కోటి చెక్కును మంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
ఎంపీ ముత్తంశెట్టికి చేదు అనుభవం
అనకాపల్లి రూరల్: రుణ మాఫీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూటకో మాట చెబుతున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు బ్యాంకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు ప్రభుత్వం ఎటూ తేల్చని తీరుతో అసహనానికి గురైన పలువురు మహిళలు ఏ విషయం తేల్చాలంటూ ఎంపీని నిలదీశారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో అధికారులతో ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చాంబర్లోకి దూసుకువచ్చిన డ్వాక్రా మహిళలు ‘రుణ మాఫీపై ఏదో తేల్చండి. బకాయిలు తీర్చాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కట్టక పోతే పొదుపు డబ్బు నుంచి మినహాయిస్తున్నారు. మేము రుణాలు తీర్చాలా? వద్దా?’ అంటూ నిలదీశారు. దీంతో అవాక్కయిన ఎంపీ ఏదోలా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కమిటీ వేశారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈలోగా పట్టణ బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జోక్యం చేసుకుని ‘తన భార్య కూడా డ్వాక్రా మహిళే’ అని అనడంతో అక్కడివారు అవాక్కయ్యారు. వెంటనే సర్దుకున్న ఎంపీ డ్వాక్రా మహిళల్లో డబ్బు న్న వారు కూడా ఉన్నారని, అందువల్ల కేటగి రీగా విభజించి అర్హుల రుణాలే రద్దు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.