చేనేతలరాత ఇంతేనా..
♦ చేనేత రుణాలన్నీ మాఫీ చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం
♦ 159 గ్రూపులకుగాను కేవలం 42 గ్రూపులకే మాఫీ
♦ వ్యక్తిగత రుణాల విషయంలో 757కుగాను 512 మందికే వర్తింపు
♦ పవర్‌లూమ్స్ విషయంలోనూ అదే దారి
♦ ఆధార్ అనుసంధానం పేరుతో చాలామందికి మాఫీ కాని వైనం
♦ మార్చి చివరికి బ్యాంకు ఖాతాల్లో పడుతుందంటున్న అధికారులు
♦ రెండేళ్లుగా మొదటి విడతకే దిక్కులేదు...రెండో విడత ఎప్పుడో?
అధికారంలోకి రాక మునుపు ఒకమాట... వచ్చిన తర్వాత మరొక మాట చెప్పడం ‘దేశం’ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మహిళలు.. రైతులు.. చేనేతలు.. ఎవ్వరూ కూడా ఒక్కపైసా బ్యాంకులకు కట్టొద్దు...అధికారంలోకి రాగానే మాఫీ చేసి రుణ విముక్తులను చేస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రగల్బాలు పలికారు. ‘ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న......ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ విషయంలో బాబు యూ టర్న్ తీసుకున్నారు. ఏదో ఒక రూపంలో వీలైనంత మేర రుణమాఫీని తగ్గించడమే లక్ష్యంగా ఆంక్షలు పెడుతున్నారు. రెండేళ్లు పూర్తవుతున్నా నేటికీ ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ చేతికి అందకపోవడం గమనార్హం.
సాక్షి, కడప: జిల్లాలో చేనేతలకు సంబంధించి వేలాది మగ్గాలు ఉన్నాయి. ప్రధానంగా మాధవరం, ప్రొద్దుటూరు, పుల్లంపేట, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాలలో చేనేత వృత్తిని నమ్ముకుని అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, చేనేత వృత్తిలో నష్టాలు రావడంతో చాలామంది రుణాలు తీసుకున్నారు. ప్రధానంగా జిల్లాలో 757 మంది చేనేత కార్మికులు వ్యక్తిగత రుణాలు తీసుకోగా, అందులో 512 మందికి రూ.1.37 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. మిగిలిన 245 మందికి సంబంధించిన ఆధార్ ఠ మొదటిపేజీ తరువాయి
నెంబర్లు అనుసంధానం కాలేదు. దీంతో వీరికి రెండవ విడతలో ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 216 పవర్‌లూమ్స్ ఉండగా, అందులో 126 పవర్‌లూమ్స్‌కు మాత్రమే రూ.41,87,382 లక్షలు కేటాయించారు. మిగిలిన 90 పవర్‌లూమ్స్‌కు ఎప్పుడు కేటాయింపులు జరుగుతాయో అర్థం కావడం లేదు.
సగానికి సగం గ్రూపులకు కూడా అందని మాఫీ
ఇక చేనేతల్లో మహిళా గ్రూపులకు సంబంధించి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు బాబు సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో ఒక్కో గ్రూపులో ఒకరు మొదలుకుని ఎంతమంది ఉన్నా రూ.5 లక్షల వరకు రుణాలు అందించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 159 మహిళా చేనేత గ్రూపులు ఉండగా, కేవలం 42 గ్రూపులకు మాత్రమే రుణమాఫీని వర్తింపజేశారు. 42 గ్రూపులకుగాను కోటి 2 లక్షల రూపాయలను కేటాయించారు. అయితే మరో 117 గ్రూపులకు సంబంధించిన రుణమాఫీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. అంటే సగం గ్రూపులకు కూడా మాఫీ సొమ్ము అందని పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది.
రెండవ విడత ఎప్పుడో?
మొదటి విడత చేనేత రుణమాఫీకి సంబంధించి చేనేత జౌళి శాఖ అధికారులు జిల్లాలోని వ్యక్తిగత, గ్రూపు, పవర్‌లూమ్స్‌ల ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం రూ. 2.80 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రతిపాదనలు వెళ్లిన అనంతరం సంబంధిత కార్మికుల అకౌంట్లలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. మొదటి విడత రుణమాఫీ మొత్తం ఈనెలాఖరులోపు జమ అయ్యే అవకాశం కనిపిస్తుండగా, రెండవ విడత ఎప్పుడు మంజూరవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికి జిల్లాలో చేనేత కార్మికులకు రుణాలు అందడంతో పాటు రుణమాఫీ కూడా పెద్ద సమస్యగా మారింది.
మార్చి చివరి నాటికి ఖాతాలకు రుణమాఫీ -
ఏడీ జయరామయ్య
జిల్లాలో చేనేత రుణమాఫీకి సంబంధించి 512 మందికి వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయని.. 42 గ్రూపులకు, మరో 126 పవర్‌లూమ్స్‌కు రుణమాఫీ మంజూరైనట్లు చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జయరామయ్య తెలిపారు. ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ రూ. 2.80 కోట్లు రుణమాఫీ కింద ప్రభుత్వం కేటాయించిందని...మార్చి నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అంతేకాకుండా మరికొన్ని గ్రూపులకు, వ్యక్తిగత రుణాలకు సంబంధించి కూడా రెండవ విడతలో మాఫీ సొమ్ము జమచేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆధార్ అనుసంధానం కాకపోవడంతోపాటు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు.