సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని గతంలో నిర్ణయించి ఇటీవల అందులో సరిగ్గా రూ. 99,999 వరకు తీసుకున్న రైతుల రుణమాఫీ సొమ్మును మాఫీ చేసింది. అలాగే రూ. 99,999 నుంచి రూ. లక్ష వరకు శ్లాబ్ అంటే కేవలం ఒక రూపాయి తేడా ఉన్న రైతు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క తేడాలోనే రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము భారీగా ఉండటం గమనార్హం.
మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించింది. ఇంకా రూ. 99,999 నుంచి రూ. లక్ష మధ్య అంటే ఒక్క రూపాయి తేడాలోనే ఏకంగా 20.02 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇంకా రుణమాఫీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరూ రూ. 99,999 లెక్కకు రుణాలు తీసుకోరు.
రౌండ్ ఫిగర్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 99,999 వరకు శ్లాబ్‌గా గుర్తించి ప్రస్తుతం రుణాలను మాఫీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 4–5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులూ చాలా మంది ఉండగా వారికి రూ. లక్ష వరకు మాత్రమే రుణమాఫీ జరగనుంది. రూ. లక్ష అంతకుమించి రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment