రుణమాఫీ కాలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల నిరసనలు
బ్యాంకుల వద్ద బైఠాయించిన రైతులు.. కొన్నిచోట్ల బ్యాంకులకు తాళం
సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
మంచిర్యాల జిల్లాలో మాఫీ వర్తించలేదని ఆత్మహత్యాయత్నం
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ ప్రకటించిన తర్వాత కూడా తమకు రుణాలు మాఫీ కాలేదంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చాలాచోట్ల రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు.
⇒ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్, బోథ్, భీంపూర్ మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. తలమడుగులో 500మందికి పైగా రైతులు సీఎం దిష్టిబొమ్మతో డప్పుచప్పుళ్ల మధ్య శవయాత్ర నిర్వహించారు. కర్మకాండ కుండలతోనే మహారాష్ట్ర బ్యాంకులోనికి వెళ్లారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. జైనథ్ మండలం గిమ్మలో రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. తర్వాత బ్యాంకు అధికారుల వినతిమేరకు తాళాలు తొలగించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌లో రైతు జక్కుల లచ్చన్న పంచాయతీ కార్యాలయం వద్ద విషగుళికలు తిని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడ ఉన్న మరో రైతు అడ్డుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
⇒ నిజామాబాద్ జిల్లా 63 నంబరు జాతీయ రహదారి వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్, మోర్తాడ్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.
⇒తమకు రుణమాఫీ కాలేదంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్ శాఖ ఇండియన్ బ్యాంక్‌ను ముట్టడించి రైతులు షట్టర్‌ను మూసివేశారు. తర్వాత అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఈ నెల 20న రైతు వేదికలో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ బ్యాంక్ పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించి సుమారు 1,250 మంది రైతులకు ఖాతాలుండగా కేవలం 430 మందికే రుణమాఫీ జరిగిందన్నారు.
⇒ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు వద్ద కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రుణమాఫీ జాబితాలో తమ పేర్లులేవంటూ సుమారు 500 మంది రైతులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు.
⇒ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోని రైతువేదికలో వ్యవసాయశాఖ, లీడ్ బ్యాంక్ అధికారులతో నిర్వహించిన రుణమాఫీ అవగాహన సమావేశం రసాభాసగా ముగిసింది. మూడో విడతలో కూడా తన పేరు లేకపోవడంతో ఏలేటి రాజారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగాడు.
⇒ బౌరంపేట్‌లోని బ్యాంక్‌లో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మందికే రుణమాఫీ అయ్యిందని, మిగతా రైతులకు ఎందుకు మాఫీ చేయలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.
⇒ఖమ్మం రూరల్, కొనిజర్ల, వైరా, రఘునాథపాలెం తదితర మండలాల రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
రుణమాఫీ రూ.83
తిమ్మాపూర్: కేవలం రూ.83 మాత్రమే రుణమాఫీ కావడంతో ఓ రైతు కంగుతిన్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్యకు రూ.83 మాఫీ అయినట్టు మొబైల్‌కు సందేశం వచ్చింది. గత డిసెంబర్‌లో ఎల్‌ఎండీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.1.50 లక్షల పంటరుణం తీసుకున్న మల్లయ్య మూడో విడతలో మాఫీ అవుతుందని సంతోషించాడు.
కానీ.. రూ.83 రుణఖాతాలో జమ అయినట్లు ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్‌కు గురైన ఆయన శనివారం వ్యవసాయాధికారులను సంప్రదించగా, వారు బ్యాంకు స్టేట్‌మెంట్ తీసుకురావాలని సూచించారు. అయితే అప్పటికే బ్యాంక్ టైం అయిపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగాడు. మాఫీకి ప్రభుత్వం విధించిన నిబంధనలకు తాను అర్హుడినని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment