ముఖ్యమంత్రి గారూ..! సీఎం అంటే ‘కటింగ్‌ మాస్టరా’? | KTR comments on Revanth Reddy over farmer loan waiver | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి గారూ..! సీఎం అంటే ‘కటింగ్‌ మాస్టరా’?

Published Mon, Jun 24 2024 5:46 AM | Last Updated on Mon, Jun 24 2024 5:46 AM

KTR comments on Revanth Reddy over farmer loan waiver

‘ఎక్స్‌’వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్న

రైతు రుణమాఫీపై కోతలు పెడితే సహించేది లేదని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ‘ముఖ్యమంత్రి గారూ.. సీఎం అంటే కటింగ్‌ మాస్టరా?’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ‘ఎక్స్‌’వేదికగా వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటిలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెడుతోందని, సీఎం అనే పదానికి కటింగ్‌ మాస్టర్‌ అనే సరికొత్త నిర్వచనం తెచ్చారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయా పథకాల్లో కోతల గురించి కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు. ‘నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్‌ తెచ్చుకోమన్నారు. నేడు రూ. 2 లక్షల రుణ మాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదట రూ.39 వేల కోట్లు అని ఇప్పుడు రూ. 31 వేల కోట్లకు కటింగ్‌ పెట్టి కుదించారు’అని పేర్కొన్నారు.

పాసుబుక్కులు లేవనే నెపంతో.. లక్షల మందికి కోత పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించమని హెచ్చరించారు. అలాగే రేషన్‌ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ వదిలేయమని స్పష్టం చేశారు.

ఇప్పటికే రూ. 500 సిలిండర్, రూ. 200 యూనిట్ల విద్యుత్‌ పథకాలకు కూడా కోతలు విధించారని విమర్శించారు. ఇదే విధంగా రూ. 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి, లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని అన్నారు. ‘నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండుగ ముగిసినా.. ఎకరానికి రూ.7,500 రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్‌ ప్రచారంలో ‘‘అందరికీ అన్నీ’’అన్నారు. అధికారంలోకి రాగానే ‘‘కొందరికే కొన్ని’’అని కోతపెడుతున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తాం, పోరాడుతాం’అని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement