ఎక్కడా చారాణా రుణమాఫీ కాలేదు
రుణమాఫీపై ఏ ఊరికి వెళ్లి అడుగుదామో చెప్పు..
ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ నువ్వు
సీఎం రేవంత్‌పై ధ్వజమెత్తిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎక్కడా చారాణా రుణమాఫీ కాలేదు. ఆ తప్పు.. ఈ చేతకాని సన్నాసి సీఎం రేవంత్‌రెడ్డిది. రేవంత్‌రెడ్డీ నీ భాషలోనే చెబుతున్నా.. నువ్వు మగాడివైతే..బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు.. పోలీసు సెక్యూరిటీ లేకుండా ఊళ్లలోకి రా..నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు. అక్కడికి వెళ్లి రుణమాఫీ అయ్యిందా అనే విషయాన్ని అడుగుదాం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ వారు ఊళ్లలోకి వస్తే తరిమికొట్టాలన్న ఆలోచనతో రైతులు ఉన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే రుణమాఫీ విషయంలో పోలీసులు, వ్యవసాయ అధికారులను తప్పు పట్టాల్సిన పనిలేదని, ఆ తప్పు సీఎం రేవంత్‌దే అన్నారు. తిరుమలగిరిలో బీఆర్‌ఎస్ ధర్నా శిబిరంపై జరిగిన దాడి, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. రుణమాఫీ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయిన ఇద్దరూ మహిళా జర్నలిస్టుల పైన, ఇతర జర్నలిస్టులపైన దాడి చేసిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు.
అనంతరం డీజీపీ కార్యాలయ ఆవరణలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తిలో ప్రజాస్వామ్యపద్ధతిలో శాంతియుతంగా చేస్తున్న రైతు నిరసన దీక్షపై కాంగ్రెస్ గుండాలు ఆకస్మికంగా రాళ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. ‘మా వారు తిరగబడి ఉంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మిగలరు. కానీ శాంతియుతంగా నిరసన తెలపాలనే మేం ప్రతిఘటనకు పాల్పడలేదు’ అన్నారు. రుణమాఫీపై ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డిఅని, క్షేత్రంలో తిరగాల్సిన సీఎం ంఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
కొండారెడ్డిపల్లిలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఒక పార్టీకి శాశ్వతం కాదని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని కేటీఆర్ సూచించారు. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసినవారిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్, ఆర్.రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్, నోముల భగవత్ తదితరులు పాల్గొన్నారు.
వాళ్లవి ముందు కూల్చండి
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ వంటి నేతల భవనాలను కూల్చేసి.. ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని పేర్కొన్నారు.
‘చలో ఢిల్లీ కాదు..చలో పల్లె’ చేపట్టాలి
రుణమాఫీ జరగక లక్షలాది మంది రైతులు రగిలిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ ‘చలో ఢిల్లీ’కి బదులుగా ‘చలో పల్లె’ చేపట్టాలని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. డెంగీ మరణాలు, పెరుగుతున్న నేరాలు, రైతుల ఆందోళనలు రాష్ట్రంలో పాలన గాడి తప్పడాన్ని సూచిస్తున్నాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం, మంత్రులు పార్టీ అధిష్టానం ఆశీస్సుల కోసం పాకులాడకుండా ప్రజల నడుమకు వెళ్లాలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఏదో ఒక రోజు సీఎం కుర్చీ లాగేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment