ఏ తప్పు గుర్తించినా రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేసుకోవచ్చు
రుణమాఫీ కాని రైతుల నుంచి అఫిడవిట్ స్వీకరిస్తున్న ప్రభుత్వం
కుటుంబ సభ్యుల వివరాల సేకరణపై మార్గదర్శకాలు జారీ
గ్రామాల్లో ప్రారంభమైన సర్వే.. కొనసాగుతున్న గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ‘కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల వివరాలు వాస్తవం/సరైనవి. రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు తేలినా లేదా పంట రుణమాఫీకి అర్హత లేదని నిర్ధారణ అయినా.. పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తున్నాను.
ఆ మొత్తం రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది..’ఇది రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులు, రుణమాఫీ కోసం ఇవ్వాల్సిన అఫిడవిట్. ఇలా అఫిడవిట్ కోరడంతో పాటు రుణమాఫీ–2024 బ్యాలెన్స్ ఉన్న రైతు కుటుంబాలకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. రుణమాఫీ కాని రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. మార్గదర్శకాలకు రైతులు ఇవ్వాల్సిన అఫిడవిట్‌ను జత చేసింది.
ఫొటో తీయాలి..సెల్ఫీ దిగాలి
⇒ పంట రుణం ఉన్న రైతు ఇంటిని ఎంఏవో తప్పనిసరిగా సందర్శించి, రైతు వెల్లడించిన కుటుంబ సభ్యుల వివరాలను ఆధార్ నంబర్‌తో సహా నమోదు చేసుకోవాలి.
⇒ ఎంఏవోతో సహా ఏ అధికారికీ ఒకటి కంటే ఎక్కువ మండలాలను కేటాయించకూడదు. మండల స్థాయిలో నియమితులైన అధికారి వివరాలను వెంటనే రుణమాఫీ విభాగానికి సమర్పించాలి.
⇒ ఎంఏవో రుణమాఫీ లాగిన్‌లలో కుటుంబ సభ్యుల వివరాలను అప్‌లోడ్ చేయడానికి మొబైల్ యాప్ అభివృద్ధి చేయడం జరిగింది.
⇒ మండలంలోని అన్ని బ్యాంకు బ్రాంచీల వారీగా కుటుంబ సభ్యులను నిర్ధారించి రుణం పొందిన రైతుల జాబితా ప్రదర్శించాలి.
⇒ రుణం పొందిన రైతు జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేయాలి.
⇒ జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేసిన తర్వాత ఇతర కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి.
⇒ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో పాటు వారి వయస్సు నమోదు చేయాలి. కుటుంబ పెద్దతో ఫొటో తీయాలి.
⇒ రైతు సమర్పించే అఫిడవిట్‌లో అతను అందించిన కుటుంబ సభ్యుల వివరాలు ఏ ప్రభుత్వ అధికారి అయినా లేదా పంచాయతీ కార్యదర్శి లేదా ఏఈవో లేదా ఏఏవో ధ్రువీకరించాలి.
⇒ రైతులు సమర్పించిన అఫిడవిట్‌ను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
⇒ డేటా సేకరణ సమయంలో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు రుణం పొందిన రైతుతో ఎంఏవో సెల్ఫీ దిగి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
వివరాల సేకరణ షురూ
రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, సాంకేతిక కారణాలతో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు బుధవారం గ్రామాల్లో సర్వే చేపట్టారు. మండలం యూనిట్‌గా రైతుల వివరాలను సేకరిస్తున్నారు. అనేకచోట్ల వివరాలను సేకరిస్తున్నా రైతులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులు రుణమాఫీ విషయంపై నిలదీస్తున్నారు.
రూ.2 లక్షలకు పైగా ఉన్న సొమ్ము బ్యాంకులో చెల్లించాలా వద్దా? అని అడుగుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని అన్నారం గ్రామంలో ఎస్‌బీఐ, గ్రామీణ వికాస్‌బ్యాంక్ సైట్లు ఓపెన్‌కాగా ఎన్‌డీసీసీ బ్యాంక్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. గ్రామంలో 30 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు.
కానీ ఎన్‌డీసీసీ బ్యాంక్ సైట్ ఓపెన్ కాకపోవడంతో 15 మంది రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇంకోవైపు రుణం తీసుకొని మృతి చెందిన రైతుల రుణమాఫీకి సంబంధించి, ఆధార్, బ్యాంక్ అకౌంట్ల నమోదులో తప్పిదాలను సరిచేయడం కోసం యాప్‌లో ఎలాంటి ఆప్షన్లు లేకపోవడంతో దీనిపై స్పష్టత కొరవడింది. ఇలాంటి వారికి సంబంధించి గ్రామంలో 11 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment