
న్యూఢిల్లీ: మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని, మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం.. చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ, పెనాల్టీ గానీ విధించకూడదని ఆదేశించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: ప్రశాంత్ భూషణ్‌కు ఒక్క రూపాయి ఫైన్)
కాగా ఆగస్ట్ 31తో ముగియనున్న మారటోరియం గడువును కరోనా పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా.. సాధారణ , మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగుల జీవితాలు తలకిందులయ్యాయని, వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టగా.. అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో బడుగు వర్గాలకు ఉపశమనం లభించినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment