
ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనను వ్యతిరేకించిన భారత్
ఐక్యరాజ్య సమతి: మరణశిక్షపై మారటోరియం విధించాలన్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానం ముసాయిదాను భారత్ వ్యతిరేకించింది. ముసాయిదాకు వ్యతిరేకంగా భారత్ ఓటువేసింది. సొంత న్యాయవ్యవస్థపై నిర్ణయం, నేరస్థులకు శిక్ష వంటి అంశాలపై ఆయా దేశాల సార్వభౌమత్వ హక్కును గుర్తించడంలో ముసాయిదా విఫలమైనందున దానినివ్యతిరేకించినట్లు భారత్ పేర్కొంది. మరణశిక్షను పూర్తిగా రద్దుచేయాలన్న వైఖరితోనే ఈ ముసాయిదాను తెచ్చారని ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యప్రతినిధి మాయాంక్ జోషీ అభిప్రాయపడ్డారు.
'మరణశిక్ష అమలుపై మారటోరియం' పేరిట వచ్చిన తీర్మాన ముసాయిదాను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తృతీయ కమిటీ గత వారం ఆమోదించింది. ముసాయిదాను 114 దేశాలు సమర్థించగా, భారత్ సహా 36దేశాలు వ్యతిరేకించాయి. 34 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇక ఈ తీర్మానంలోని నిబంధనల మేరకు మరణశిక్ష అమలుపై నియంత్రణతో వ్యవహరించాలని సభ్యదేశాలకు సర్వప్రతినిధి సభ విజ్ఞప్తిచేయనుంది. 18 ఏళ్ల లోపు వయస్సువారికి, గర్భిణీ స్త్రీలకు, మానసిక దౌర్బల్యం కలిగిన వారికి మరణశిక్ష విధించరాదని కూడా సభ్యదేశాలను కోరనుంది.
**