
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లు ఈనెల 27న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం ఇమ్రాన్ ఖాన్ ఇదే వేదిక నుంచి ప్రసంగిస్తారని భావిస్తున్నారు. ఇరు నేతల ప్రసంగ సమయాలను ఇంకా ఖరారు చేయకపోయినా ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే పాక్ ప్రధాని మాట్లాడతారని తెలిసింది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్ ప్రధానులు ఒకే వేదికను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన చర్యలు విఫలమైన సంగతి తెలిసిందే. పాక్ తీరును రష్యా, అమెరికా, బ్రిటన్ సహా కీలక దేశాలు తప్పుపట్టాయి. ఐక్యరాజ్యసమితిలోనూ కశ్మీర్ పరిణామాలపై పాక్ గగ్గోలుపెట్టినా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నేతృత్వం వహిస్తున్న పోలండ్ సహా అన్ని దేశాలూ భారత్ నిర్ణయానికి బాసటగా నిలిచాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం భారత్ అంతర్గత అంశమని అమెరికా, రష్యా స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment