ఇండో-పాక్ వార్ @ అమెరికా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ సమాజంలో దాయదిని ఏకాకినిచేసి ఏకిపారేయాలనుకుంటోన్న భారత్, పాకిస్థాన్ లు అమెరికా గడ్డపై తలపడనున్నాయి. బలూచిస్థాన్ పై భారత ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రతరమైన ఉద్రిక్తత.. యూరి ఉగ్రదాడితో తారాస్థాయికి చేరింది. అదే వేడిలో భారత్, పాక్ లు బుధవారం నుంచి న్యూయార్క్ లో ప్రారంభంకానున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో దౌత్యయుద్ధాన్ని చేయనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ గౌర్హాజరు కారణంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారత బృందానికి సారథ్యం వహించనున్నారు. పాకిస్థాన్ తరఫున ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ రంగంలోకి దిగుతున్నారు. నవాజ్ 20న(బుధవారం), సుష్మా 26న(సోమవారం) ఐరాస అసెంబ్లీ సమావేశంలో మాట్లాడనున్నారు. ఎవరెవరు ఎలాంటి ఎత్తుగడలతో యుద్ధం చేయనున్నారంటే..
భారత్: కశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై ఆదివారం (సెప్టెంబర్ 18న) జరిగిన ఉగ్రదాడి ముమ్మాటికి పాక్ ప్రభుత్వ, సైనిక ప్రోద్బలంతోనే జరిగిందని, అందుకు తగిన ఆధారాలను ప్రపంచం ముందుంచనుంది. యూరి దాడి ఒక్కటేకాదు గతంలో పఠాన్ కోట్, అంతకు ముందు ముంబై తదితర కీలక దాడుల్లో పాక్ ప్రమేయం ఉందనే విషయాన్ని బలంగా వాదించనుంది. అదేక్రమంలో బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కొనసాగుతోన్న మానవ హక్కుల హననాన్ని భారత్ హైలైట్ చేయనుంది. ఏ కోణంలో చూసినా పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్థావరంగా, ఉగ్రకార్యకలాపాల అడ్డాగా ఉన్నందున దానిని ఉగ్రవాద దేశంగా గుర్తించి, అంతర్జాతీయ సమాజం నుంచి వెలి వేయాలని భారత్ వాదించనుంది.
పాకిస్థాన్: కశ్మీర్ లో అశాంతి అంశాన్ని హైటైట్ చేయడం ద్వారా భారత్ ను ఇరుకునపెట్టాలన్నది పాక్ ప్రధాన లక్ష్యం. ఉగ్రదాడుల విషయంలో భారత్ చెబుతున్నవన్నీ కట్టుకథలేనని పాకిస్థాన్ మొదటి నుంచి వాదిస్తోంది. బుధవారం నాటి నవాజ్ షరీఫ్ ప్రసంగంలో.. ఇటీవల కశ్మీర్ ఆందోళనల్లో చనిపోయిన(80 మంది)వారి గురించిన ప్రస్తావనతోపాటు కశ్మీర్ స్వయంప్రతిపత్తిపై గతంలో ఐరాసలో చేసిన తీర్మానాల అమలుకు పట్టుపట్టే అవకాశం ఉంది.
అఫ్ఘానిస్థాన్: మారిన పరిస్థితుల దృష్ట్యా భారత్ కు దగ్గరైన అఫ్ఘానిస్థాన్ ఈసారి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారత్ కు వెన్నుదన్నుగా నిలవనుంది. ఆ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్.. పాక్ పేరును ప్రస్తావించకుండా అది చేసేస్తోన్న పనులను ఎండగట్టనున్నారు.
సార్క్ బహిష్కరణ: దక్షిణ ఆసియా దేశాల కూటమి(సార్క్) నుంచి వైదొలగాలని భారత్ ప్రాథమికంగా నిర్ణయించుకుంది. భారత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ బంగ్లాదేశ్,అఫ్ఘానిస్థాన్ లు సైతం సార్క్ నుంచి వెలుపలికి రానున్నట్లు ఈ దేశ ప్రతినిధులు ప్రకటించారు.
పాక్తో పోరుకు భారత్ వ్యూహమిదే..
ఆర్థికపమైన అంశాలు: ప్రస్తుతం భారత్, పాక్ ల మధ్య కొనసాగుతోన్న వ్యాపార, వాణిజ్యాలన్నింటినీ రద్దుచేసుకోవడం, పాక్ సరుకుల దిగుమతిని ఆపేయడం, పాక్ తో వ్యాపార సంబంధాలు రద్దుచేసుకునేలా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచడం లాంటి చర్యలను భారత్ తన వ్యూహంలో భాగంగా అమలుచేయనున్నట్లు తెలిసింది.
సైనిక పరంగా: ఇన్నాళ్ల వ్యవహార శైలికి భిన్నంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పరిమిత యుద్ధం చేయనుంది. పీఓకేలోని ఉగ్రస్థావరాలపై తరచూ దాడులు చేయడంతోపాటు చొరబాట్లను ప్రోత్సహిస్తోన్న పాక్ ఆర్మీ స్థావరాలను కూడా టార్గెట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేయనున్నారు.
దౌత్యపరమైన వ్యూహం: పాకిస్థాన్ తో సంబంధాలన్నింటినీ తెంచుకోవడంతోపాటు ఆ దేశంలో రాయబారిని వెనక్కి పిలిపించాలని భారత్ భావిస్తోంది. దీనితోపాటు యూరి సహా ఇతర ఉగ్రదాడుల్లో పాక్ ప్రమేయానికి సంబంధిచిన అన్ని ఆధారాలను సమర్పించి, దర్యాప్తునకు ప్రేరేపించేలా దాయాదిపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.