
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై మరోమారు జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై వెంటనే స్పందించిన భారత్ జమ్ముకశ్మీర్‌పై పాక్ నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించింది. ఆ దేశంలో జరుగుతున్న పలు ఉల్లంఘనల నుండి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలా చేస్తున్నదని భారత్ తెలిపింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు, సాయుధ పోరాటాలపై బహిరంగ చర్చ జరిగింది. దీనిలో భారత ఉప ప్రతినిధి ఆర్ రవీంద్ర మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఒక ప్రతినిధి చేసిన రాజకీయ ప్రేరేపిత, నిరాధారమైన వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
వారి దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించిన తర్వాత ఆర్ రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు.