న్యూఢిల్లీ: కాశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో ఆదివారం నాడు సైనిక శిబిరంపై పాకిస్థాన్ టెర్రరిస్టులు దాడి జరిపి భారత ప్రభుత్వానికి పెను సవాల్‌ను విసిరిన విషయం తెల్సిందే. ఈ సవాల్‌ను భారత్ ఎలా ఎదుర్కోవాలి? భారత్‌పై పరోక్ష యుద్ధాన్ని సాగిస్తున్న పాకిస్థాన్‌కు ఎలా బుద్ధి చెప్పాలి? పాకిస్థాన్‌పై ప్రత్యక్ష సంప్రదాయక యుద్ధానికి దిగితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? ఈ ఆఖరి ప్రశ్న సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా చర్చకు రాకపోలేదు.
సంప్రదాయక యుద్ధంలో పాకిస్థాన్‌పై మనదే పైచేయన్న విషయం మనకే కాదు, అటు పాకిస్థాన్‌కు కూడా తెలుసు. అయినప్పటికీ అది ఊహించినంత ఈజీ కాదు. పాకిస్థాన్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించే అక్కడి సైన్యం పర్యవసానాలను పక్కన పెట్టి మనపై యుద్ధం చేయడానికి ఏ మాత్రం వెనకాడదు. మనం పాకిస్థాన్‌పై సంప్రదాయక యుద్ధం చేయాలంటేనే ఐక్యరాజ్యసమితి మొదలుకొని అమెరికా వరకు పలు దేశాల అనుమతి లేదా మద్దతు మనకు కావాలి. పాకిస్థాన్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇటీవల మాట్లాడుతున్న అమెరికా పాక్‌పై యుద్ధానికి మద్దతిచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.
అంతేకాకుండా సంప్రదాయక యుద్ధంలో మనకన్నా బలమైన చైనా మనల్ని వ్యతిరేకించడమే కాకుండా పాక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నందున ఆ దేశానికి అండగా నిలబడే అవకాశం లేకపోలేదు. సంప్రదాయక యుద్ధం వల్ల ఇరువైపుల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడమే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు దారితీస్తుంది. ఇంకా ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. పాకిస్థాన్ తరహాలోనే మనం కూడా ఆ దేశంపైనా పరోక్ష యుద్ధాన్నే కొనసాగిస్తే?
ఇది కూడా సాధ్యమయ్యే పనికాదు. పాకిస్తాన్‌లో కొన్ని తరాలుగా టెర్రరిస్టు సంస్థలు వేళ్లూనుకొని ఉన్నాయి. పాక్‌కు వ్యతిరేకంగా ఏ టెర్రరిస్టు సంస్థలు మన భూభాగంలో లేవు. బెలూచిస్థాన్ విముక్తి కోసం పరోక్ష యుద్ధానికి దిగుతామంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ, సహాయ సహకారాలు పొందేందుకు వేలాది మంది మిలిటెంట్లు లేదా టెర్రరిస్టులు సిద్ధంగా ఉన్నారు. అదే చేయాలనుకుంటే ఎన్నో ఏళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రావాలి. అంతకంటే ముందు కాశ్మీరు విముక్తిని కోరుకోని మనం బలూచిస్థాన్ విముక్తిని మాత్రం నైతికంగా ఎలా కోరుకుంటాం?
పాకిస్థాన్‌తో జరిపిన సంప్రదాయక యుద్ధాల్లో కన్నా పాకిస్థాన్ జరిపిన పరోక్ష యుద్ధంలోనే భారత్ సైనికులు ఎక్కువ మరణించారన్న విషయంలో సందేహం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పఠాన్‌కోట్, పాంపోర్, యురి లాంటి అతిపెద్ద టెర్రరిస్టు దాడులు జరిగాయి. మరి పాకిస్థాన్‌కు బుద్ది చెప్పడం ఎలా? ఊహించని విధంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఎంపిక చేసిన టెర్రరిస్టు శిబిరాలను నామరూపాలు లేకుండా నిర్మూలించడమే అందుకు మార్గం. పాకిస్థాన్‌లోకి జొరబడి అంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామా బిన్‌లాడెన్‌ను తుదముట్టించిన అమెరాకా స్పెషల్ కమాండో ఆపరేషన్, ఇరాక్‌లో సద్ధాంకు వ్యతిరేకంగా అమెరికా నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ కమాండ్ తరహా ఆపరేషన్లు మనమూ నిర్వహించాలి.
అందుకు అలాంటి అమెరికా తరహా కమాండో వ్యవస్థను లేదా బ్రిటన్ తరహా స్పెషల్ ఫోర్సెస్ డైరెక్టర్ వ్యవస్థ మనమూ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయలేం. కొన్నేళ్లు పడుతుంది. అయినా సరే అదే ఉత్తమమైన మార్గమని మాజీ ప్రత్యేక సైనిక దళాల అధికారి లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్దెవ్ లిడ్డర్, ప్రత్యేక సైనిక దళాల మాజీ అధికారి, ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ మాజీ డీజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రకాష్ కటోచ్, నేషనల్ సెక్యూరిటీ పత్రిక మాజీ సంపాదకుడు సైకత్ దత్తా అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహించే శక్తి సామర్థ్యాలు మన పారా మిలిటరీ దళాల్లో 1.9,10, 21 బెటాలియన్లకు ఉన్నాయి. వాటిలో 9, 10 దళాలకు శ్రీలంకలో ఎలీటీటీఈ తీవ్రవాడులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరిపిన అనుభవం కూడా ఉంది.
ఇలాంటి దళాలతోపాటు వైమానిక దళాల నుంచి కొన్ని దళాలను ఎంపిక చేసుకొని ప్రత్యేక ఆపరేషన్ కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థ బ్రిటన్‌లో ప్రధాన మంత్రి నాయకత్వంలోని సంక్షోభ నివారణ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. మనం ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈ వ్యవస్థకు ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరం. మన దేశంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ అనే మూడు సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు కూడా ఒక్క మంత్రిత్వ శాఖ కింద కాకుండా వేర్వేరు మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి.
పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం చేస్తే....
Published Tue, Sep 20 2016 4:47 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement
Advertisement