న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను మరింతగా పొడిగించిన నేపథ్యంలో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను కూడా మరో 3 నెలలు పొడిగించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ పరిశీలనలో ఉంది. లాక్‌డౌన్ కొనసాగింపు కారణంగా ఇటు వ్యక్తులు, అటు సంస్థలకు ఆదాయాలొచ్చే మార్గాలు లేనందున మారటోరియంను పొడిగించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఆర్‌బీఐ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపులపై మారటోరియం విధిస్తూ మార్చి 27న ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని గడువు మే 31తో ముగిసిపోనుంది. అయితే, లాక్‌డౌన్ పొడిగించడం, ఎత్తివేత తర్వాత కూడా రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడం వంటి అంశాల కారణంగా మారటోరియంను పొడిగించడమే శ్రేయస్కరమని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కష్టకాలంలో ఇటు రుణగ్రహీతలకు, అటు బ్యాంకులకు ఇది ఊరటనివ్వగలదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment