ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో రుణగ్రహీతలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలను 2021 దాకా వన్–టైమ్ ప్రాతిపదికన పునర్‌వ్యవస్థీకరించేందుకు అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కోరాయి. అలాగే రుణ వాయిదాలపై మారటోరియం వెసులుబాటు తమకూ ఇవ్వాలని, ప్రొవిజనింగ్ నిబంధనల సడలింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్‌బీఐతో జరిగిన సమావేశంలో పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు ఎన్‌బీఎఫ్‌సీల సమాఖ్య ఆర్థిక రంగ అభివృద్ధి మండలి (ఎఫ్‌ఐడీసీ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో తమ కస్టమర్ల ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలం కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్‌బీఐకి తెలిపాయి. ప్రధానంగా రవాణా ఆపరేటర్లు, కాంట్రాక్టర్లు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మొదలైన వాటిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉందని ఎన్‌బీఎఫ్‌సీలు వివరించాయి.
‘ఈ నేపథ్యంలో మొండిపద్దుల కింద వర్గీకరించే పరిస్థితి రాకుండా.. 2021 మార్చి దాకా రుణాల రీపేమెంట్ షెడ్యూల్స్‌ను సవరించేందుకు లేదా వాయిదాలను పొడిగించేందుకు లేదా ఈఎంఐలను పునర్‌వ్యవస్థీకరించేందుకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతివ్వాలి‘ అని కోరినట్లు ఎఫ్‌ఐడీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చిన రుణాలను 2020 డిసెంబర్ దాకా వన్–టైమ్ పునర్‌వ్యవస్థీకరణ చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ అనుమతించింది. దీన్ని మిగతా రుణ గ్రహీతలందరికీ కూడా వర్తింపచేయాలని ఎన్‌బీఎఫ్‌సీలు కోరుతున్నాయి. ఇక మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేసుకునేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియంతో రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం లభించిందని ఎఫ్‌ఐడీసీ తెలిపింది. అయితే, పరిస్థితులు ఇంకా చక్కబడనందున నాలుగో నెలలోనూ వారు వాయిదాలు చెల్లించగలిగే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది.
నిధుల లభ్యత పెంచాలి ..
తమ రుణ వితరణ కార్యకలాపాలు యథాప్రకారం సాగేలా తోడ్పడేందుకు రీఫైనాన్స్ మార్గం ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి).. నాబార్డ్ నుంచి మరిన్ని నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌బీఎఫ్‌సీలు కోరాయి. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్‌టీఆర్‌వో 2.0)కి సగం స్థాయిలోనే బిడ్లు రావడమనేది .. బ్యాంకులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని సూచిస్తోందని ఎఫ్‌ఐడీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా మొత్తాన్ని సిడ్బి, నాబార్డ్‌లకు కేటాయించి తద్వారా తమకు నిధుల లభ్యత మెరుగుపడేలా చూడాలని కోరింది.
ఇక, గడువు తీరి 1 రోజు దాటిన రుణ పద్దులన్నింటికీ 10 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాలన్న ఆదేశాలను కాస్త సడలించాలని కోరింది. తమ దగ్గర రుణాలు తీసుకునే ట్రక్కు ఆపరేటర్లు లాంటి వివిధ వర్గాలవారు పలు కారణాలతో ఈఎంఐలను కాస్త ఆలస్యంగా చెల్లించడం సాధారణమేనని పేర్కొంది. కొంత ఆలస్యమైనా 30 రోజుల్లోపే చెల్లించేస్తుంటారు కాబట్టి, ఈ పద్దులను క్రెడిట్ రిస్కు కింద పరిగణించడానికి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనింగ్ నిబంధనను 30 రోజులు దాటిపోయిన రుణాలకు మాత్రమే వర్తింపచేసేలా అనుమతినివ్వాలని ఎన్‌బీఎఫ్‌సీలు విజ్ఞప్తి చేశాయి.
పీఎస్‌బీలకు మొండిపద్దుల భారం
► ఈసారి 2–4% పెరుగుతాయి
► బ్యాంక్ ఆఫ్ అమెరికా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మొండిబాకీల భారం 2–4 శాతం మేర పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజి దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ) హెచ్చరించింది. దీనితో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కింద ప్రభుత్వం 7–15 బిలియన్ డాలర్ల దాకా అదనపు మూలధనం సమకూర్చాల్సి రావొచ్చని పేర్కొంది. ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను వసూళ్లు పడిపోవడం, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు నెరవేరే అవకాశాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా ద్రవ్య లోటు 2 శాతం మేర పెరగవచ్చని బీవోఎఫ్‌ఏ తెలిపింది. బ్యాంకులకు అదనపు మూలధనం అందించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషించాల్సి రావచ్చని వివరించింది.రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం లేదా ఆర్‌బీఐ దగ్గరున్న నిల్వల నుంచి కొంత భాగాన్ని వినియోగించడం వంటి అంశాలు పరిశీలించవచ్చని తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన పరిణామాలతో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగవచ్చంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీవోఎఫ్‌ఏ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment