
ముంబై: కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో ఆర్‌బీఐ సూచనలకు అనుగుణంగా అర్హత కలిగిన రిటైల్ రుణ గ్రహీతలకూ తమ రుణాలను ఒక్కసారి పునర్‌వ్యవస్థీకరించుకునే సదుపాయాన్ని ఎస్‌బీఐ కల్పిస్తోంది. రిటైల్ కస్టమర్లు తమ రుణ పునర్‌వ్యవస్థీకరణకు తాము అర్హులా, కాదా తెలుసుకునే సదుపాయాన్ని ఎస్‌బీఐ పోర్టల్‌లో ఏర్పాటు చేసినట్టు బ్యాంకు ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు.
రుణ పునర్ వ్యవస్థీకరణ అర్హత గురించి తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంకు శాఖలను సందర్శించడానికి బదులుగా ఆన్‌లైన్‌లోనే ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అర్హత కలిగిన కస్టమర్లు తర్వాత పేపర్లపై సంతకాలు చేసేందుకు బ్యాంకు శాఖకు వెళితే సరిపోతుందన్నారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ కోరుకుంటే, మిగిలిన చెల్లింపుల కాలానికి అదనంగా 0.35 శాతం వార్షిక వడ్డీని రుణదాతలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకు పోర్టల్‌ను 3,500 మంది సందర్శించగా, వారిలో 111 మంది రుణ పునర్‌వ్యవస్థీకరణకు అర్హత ఉన్నవారిగా చెప్పారు.
రిస్క్‌కు విముఖం కాదు.. డిమాండ్ లేదంతే..
బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు వెనకాడవని, అదే సమయంలో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాతి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన వివేకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా రజనీష్ మాట్లాడారు.