ఇన్ఫోసిస్లో భారీ మార్పు
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ మార్పునకు తెరతీసింది. ఇన్నాళ్లూ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న కేవీ కామత్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రెసిడెంట్గా నియమితులై.. రాజీనామా చేస్తున్నందున ఆయన స్థానంలో రామస్వామి శేషసాయిని నియమించారు. శేషసాయి నియామకాన్ని కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఆయన తక్షణం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
67 ఏళ్ల శేషసాయి ఇన్ఫోసిస్ బోర్డులో 2011 జనవరి నుంచి ఇండిపెండెంట్ డైరెక్టర్గాను, ఆడిట్ కమిటీకి ఛైర్పర్సన్గాను వ్యవహరిస్తున్నారు. శేషసాయిని తన వారసుడిగా ఎంచుకోవడం ద్వారా బోర్డు చాలా సరైన నిర్ణయం తీసుకుందని కేవీ కామత్ అన్నారు. ఆయన అనుభవం కంపెనీకి అన్నిరకాలుగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా ఇన్ఫోసిస్కు సేవలందించిన కామత్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శేషసాయికి ఆహ్వానం పలికారు.