ఎలాంటి విభేదాలు లేవు-ఇన్ఫీ ఛైర్మన్
ముంబై: ఇన్ఫోసిస్ సంస్థలో ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో ఎలాంటి సమస్యలు లేవని బోర్డ్ వివరణ ఇచ్చింది. వ్యవస్థాపకులకు బోర్డ్‌కుమధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫీ ఛైర్మన్ శేషపాయి స్పష్టం చేశారు. ముఖ‍్యంగా సంస్థ సీఈవో విశాల్ సిక్కా వేతనం సరియైనదేనని తెలిపారు. అలాగే బోర్డు పారదర్శకతకు, కార్పొరేట్ పాలనకు వచ్చిన ప్రమాదమేమీలేదని వివరణ ఇచ్చారు. అన్ని బోర్డు నిర‍్ణయాల మేరకు జరిగినట్టు తెలిపారు. ఇది బోర్డువార్ గా చూడొద్దని కోరారు. వ్యవస్థాపకులు వ్యక‍్తం చేసిన భిన్నాభిప్రాయాలు సంస్థ అభివృద్ధికోసం చేసినట్టుగా భావించాలన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన వాటాదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థలో కార్పొరేట్ నైతికత కు పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు హామీఇచ్చారు.
ముఖ‍్యంగా పునీత సిన్హా, ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ప్రహ్లాద్ నియామకాన్ని పూర్తిగా సమర్ధించుకున్నారు. ఒక మహిళ ప్రొఫెషన్ ను ఆమె జీవిత భాగస్వామి(జయంత్ సిన్హా) వృత్తి ఆధారంగా చూడడం సరియైంది కాదని వ్యాఖ్యానించారు. వారు పూర్తిగా అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నారని చెప్పారు. అలాగే ఈ నియామకాలను ఒక పద్ధతి ప్రకారమే జరిగినట్టు తెలిపారు. వారు బోర్డులో ఉండడం తమకు గర్వకారణం మన్నారు. తమకు పటిష్టమైన ఇంటర్నెల్ ఆడిట్ కమిటీ ఉందని చెప్పారు. ఈ మేరకు బోర్డులో నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వ్యవహారాల్లో గోల్డెన స్టాండర్డ్స్ ను పాటిస్తున్నామని తెలిపారు.
అలాగే ప్రధానంగా సెవరెన్స్ ప్యాకేజీలపై వచ్చిన ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. అయితే కెన్నడీ సహా అన్ని ప్యాకేజీలు కూడా సరియైనవేనని చెప్పుకొచ్చారు. ఇన్పోసిస్ లో నెలకొన్న సంక్షోభంపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో సోమవారం ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శేషసాయి ఈ వివరణ ఇచ్చారు.
మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న సీఈవో విశాల్ సిక్కా ఇన్ఫీలో నెలకొన్న ముసలంపై స్పందించారు. తమకు వ్యవస్థాపకులు నారాయణ మూర్తితో హృదయపూర‍్వక సంబంధాలు ఉన్నాయని విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తలు సరికాదని , బోర్డులో చాలామంది డైరెక్టర్లతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. పటిష్టమైన పునాదితో ఇన్ఫోసిస్ కొనసాగుతోందని విశాల్ సిక్కా స్పష్టం చేశారు.