ఇన్ఫీలో అలజడి: షేర్లు ఢమాల్
ఇన్ఫీలో అలజడి: షేర్లు ఢమాల్
Published Fri, Jun 9 2017 11:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
బెంగళూరు: ఇన్ఫోసిస్ మరో సంచలనం చోటుచేసుకోబోతున్నట్టు రిపోర్టులు వస్తుండటంతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 3.5 శాతం పైగా నష్టపోయాయి. ఇటీవల కంపెనీ వ్యవస్థాపకులకు, మేనేజ్ మెంట్ కు మధ్య తలెత్తిన వివాదాలతో ఇన్ఫీ సహ వ్యవస్థాపకులు పూర్తిగా తమ స్టేక్ ను అమ్మేయాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను వారు అమ్మేయాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం బయటికి పొక్కగానే కంపెనీ షేరు 3.47 శాతం మేర పడిపోయింది. మే 5 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం మేర కిందకి జారింది. నేటి మార్కెట్లో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లే టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రిపోర్టులపై స్పందించిన ఇన్ఫీ వ్యవస్థాపకలు నారాయణమూర్తి, ఈ వార్తలను ఖండిస్తున్నారు.
ప్రమోటర్స్ గ్రూప్ లో నారాయణమూర్తి, ఆయన కుటుంబసభ్యులకే అత్యధికంగా 3.44 శాతం స్టేక్ ఉంది. ఇన్ఫీలో అతిపెద్ద షేర్ హోల్డర్ గా కూడా ఆయనే ఉన్నారు. అయితే ఇంకా ప్రమోటర్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఈ విషయంపై స్పందించలేదు. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు చోటుచేసుకున్న వివాదం తెలిసిందే. గత మూడేళ్లుగా కంపెనీ నడుస్తున్న తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కార్పొరేట్ గవర్నెర్స్ పై బహిరంగంగానే పలుమార్లు బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. అయినా కూడా బోర్డు సభ్యులు ఏ మాత్రం సమస్య లేదన్న రీతిలో వ్యవహరించడం ఈ పరిణామాలకు దారితీస్తోంది.
Advertisement