Infosys shares
-
10 వేలు = 6.3 కోట్లు!!
ఎప్పటికీ మీ దగ్గరే అట్టిపెట్టుకోవాలనుకునే షేర్లనే కొనుగోలు చేయాలని ఇన్వెస్టింగ్ దిగ్గజం వారెన్ బఫెట్ తరచూ చెబుతుంటారు. ఆయన మాటలను తాజాగా ఇన్ఫోసిస్ షేర్ నిజం చేసింది. ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో లిస్టయి గురువారం నాటికి సరిగ్గా పాతికేళ్లు నిండాయి. ఈ 25 ఏళ్లలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిన బ్లూ చిప్ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. కంపెనీ ఇచ్చిన డివిడెండ్లు, బోనస్, షేర్ల విభజన మొత్తం కలుపుకుంటే ఈ పాతికేళ్లలో అనూహ్యమైన భారీ రాబడులనిచ్చింది. 40 శాతానికి పైగా చక్రగతిన వృద్ధి చెందిన స్థాయి లాభాలను పంచింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ.6.34 కోట్లకు పెరిగి ఉండేదనేది గణాంకాలు చెబుతున్న మాట. ఈ ఏడాది మార్చి నాటికి ఇన్ఫోసిస్, ఇతర అనుబంధ కంపెనీల్లో కలిపి మొత్తం 2.04,107 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎలాంటి రుణ భారం లేని ఈ కంపెనీకి ప్రస్తుతం రూ.19,818 కోట్ల విలువైన నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 24 శాతం ఎగసింది. పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాని ఐపీఓ 1981లో పుణేలో ఒక చిన్న భవంతిలో 250 డాలర్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఇన్ఫోసిస్ ప్రస్థానం ప్రారంభమైంది. 1992లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌గా పేరు మార్చుకుంది. 2011లో ఇన్ఫోసిస్ లిమిటెడ్‌గా మారింది. ఈ కంపెనీ 1993లో రూ.95 ధరతో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చింది. ఈ ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాలేదు. 13 శాతం వాటాను మోర్గాన్ స్టాన్లీ కొనుగోలు చేసింది. 1993, జూన్ 14న స్టాక్ మార్కెట్లో రూ.145 ధర వద్ద లిస్టయింది. ఆ తర్వాత ఈ షేర్ పెరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్లకు లాభాలు పంచుతూనే ఉంది. ఈ పాతికేళ్లలో కంపెనీ మొత్తం 11 సార్లు బోనస్‌లు ఇచ్చింది. దీంట్లో 10 సార్లు ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇచ్చింది. 2004లో మాత్రం ఒక షేర్‌కు మూడు షేర్లను బోనస్‌గా (3:1) ఇచ్చింది. 1999లో రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.5 ముఖ విలువ గల రెండు షేర్లుగా విభజించింది. 1993లో వంద ఇన్ఫోసిస్ షేర్లు ఉంటే (ఐపీఓలో రూ.10,000 పెబ్టుబడి) ఈ బోనస్‌లు, షేర్ల విభజనను కూడా కలుపుకుంటే ప్రస్తుతం షేర్ల సంఖ్య 51,200కు పెరుగుతుంది. గురువారం నాటి ముగింపు ధరను (రూ.1,239) పరిగణనలోకి తీసుకుంటే ఈ షేర్ల విలువ రూ.6.34 కోట్లుగా ఉంటుంది. ఇక 2,000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లిస్తూనే ఉంది. ఆ డివిడెండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వాటాదారులకు మరింత విలువ సమకూరినట్లే. ఏడీఆర్‌లు జారీ చేసిన తొలి భారత కంపెనీ... 1999లో ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఈసాప్స్‌ను (ఎంప్లాయి స్టాక్ ఆప్షన్స్) ఇచ్చింది. వీటితోనే ఎందరో ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. అదే ఏడాది ఏడీఆర్‌లను (అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్) కూడా జారీ చేసింది. ఏడీఆర్‌లు జారీ చేసిన తొలి భారత కంపెనీ కూడా ఇదే. భవిష్యత్తులో కూడా ఇన్ఫోసిస్ మంచి లాభాలనే ఇస్తుందన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనా. భారీగా వృద్ధికి అవకాశాలున్న డిజిటల్ రంగంలో ఈ కంపెనీ పెట్టుబడుల జోరును పెంచుతోందని, మంచి వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని వారంటున్నారు. ఏడాది కాలంలో ఈ షేర్ రూ.1,420కు చేరగలదన్న అంచనాలతో షేర్‌ఖాన్ బ్రోకరేజ్ ఈ షేర్‌ను ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. -
ఇది కూడా ఇన్ఫీని ఆదుకోలేకపోతుంది
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను బైబ్యాక్ ఆఫర్ కూడా ఆదుకోలేకపోతుంది. సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో మొదలైన ఇన్ఫీ షేర్ల పతనం, సోమవారం ట్రేడింగ్‌లోనూ కొనసాగుతోంది. పలు బ్రోకరేజ్ సంస్థలు ఇన్ఫోసిస్ షేరు విలువను డౌన్ గ్రేడ్ చేయడంతో, ప్రారంభ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు 4.39 శాతం పడిపోతూ.. రెండేళ్ల కనిష్ట స్థాయిల వద్ద నమోదవుతున్నాయి. శుక్రవారం విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించడంతో, ఆ రోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్ఫీ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో దాదాపు 13 శాతం మేర షేరు విలువ దిగజారింది. దీంతో ఇన్ఫీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.30వేల కోట్ల మేర ఆవిరైపోయింది. కాగ, సిక్కా రాజీనామా అనంతరం ఒక్కరోజు వ్యవధిలోనే అంటే శనివారం ఇన్ఫోసిస్ రూ.13వేల కోట్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇది మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 4.92 శాతం. బైబ్యాక్ ఆఫర్‌తో కంపెనీ షేర్లు కోలుకుంటాయని విశ్లేషకులు భావించారు. కానీ ఇన్ఫీ షేర్లు కోలుకోకపోగా, రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. కంపెనీ నుంచి విశాల్ సిక్కా వైదొలగడం, స్వల్పకాలకంగా, మధ్యకాలికంగా ఇన్పీ పనితీరుపై ప్రభావం చూపుతుందని, 2017-18 ఆర్థిక సంవత్సర గైడెన్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయంటూ బ్రోకరేజ్ సంస్థలు చెప్పాయి. రూ.929 వద్ద ప్రారంభమైన షేరు విలువ రూ.929 వద్ద గరిష్ట స్థాయిలను, రూ.882.55 వద్ద కనిష్ట స్థాయిలను నమోదుచేసింది. మరోవైపు మిగతా ఐటీ దిగ్గజాలు టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రోలు లాభాలు పండిస్తున్నాయి. సిక్కా దెబ్బకు పతనమైన మార్కెట్లు కూడా నేటి ట్రేడింగ్‌లో పునరుద్ధరించుకున్నాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు మేర పైకి ఎగిసింది. -
ఇన్ఫోసిస్ షేర్లకు బైబ్యాకు జోరు
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇంట్రాడేలో ఇన్ఫోసిస్ షేర్లు 4.63 శాతం మేర పైకి ఎగిసి, రూ.1,020.25 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదుచేశాయి. ఆగస్టు 19(శనివారం) షేరు బై బ్యాకు ప్రతిపాదనపై కంపెనీ బోర్డు సమావేశం కాబోతుందని ఇన్ఫీ తెలిపిన నేపథ్యంలో షేర్ల జోరు ఊపందుకుంది. '' ఇన్ఫోసిస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కంపెనీ ఈక్విటీ షేర్లు బైబ్యాకు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు 2017 ఆగస్టు 19న సమావేశం ఏర్పాటుచేస్తున్నాం'' అని ఇన్ఫోసిస్ బొంబై స్టాక్ ఎక్స్చేంజీకి ప్రకటన విడుదల చేసింది. ఆటోమేషన్, కొన్ని దేశాల్లో వీసా నిబంధనల కఠినతరంతో ఐటీ కంపెనీల కోర్ బిజినెస్‌ల వృద్ది నెమ్మదించింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. 2017 జూన్ 30 నాటికి ఇన్ఫోసిస్ వద్ద లిక్విడ్ అసెట్స్(నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు) రూ.39వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఐటీ కంపెనీల వద్ద నగదు నిల్వలు మంచిగా ఉండటంతో, వాటిని షేర్ హోల్డర్స్‌కు పంచాలని బాగా ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీల్లో అతిపెద్ద దిగ్గజం టీసీఎస్ కూడా షేర్ బైబ్యాక్స్‌ను ప్రకటించింది. రూ.16,000 కోట్ల షేరు బైబ్యాకును ఈ ఏడాది మేలో పూర్తిచేసింది. విప్రో కూడా గత నెలలో రూ.11,000 కోట్ల బైబ్యాకును చేపట్టనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం 4.50 శాతం పైగా పెరిగి రూ.1,020 వద్ద ట్రేడవుతున్నాయి. -
ఇన్ఫీలో అలజడి: షేర్లు ఢమాల్
బెంగళూరు: ఇన్ఫోసిస్ మరో సంచలనం చోటుచేసుకోబోతున్నట్టు రిపోర్టులు వస్తుండటంతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 3.5 శాతం పైగా నష్టపోయాయి. ఇటీవల కంపెనీ వ్యవస్థాపకులకు, మేనేజ్ మెంట్ కు మధ్య తలెత్తిన వివాదాలతో ఇన్ఫీ సహ వ్యవస్థాపకులు పూర్తిగా తమ స్టేక్ ను అమ్మేయాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను వారు అమ్మేయాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం బయటికి పొక్కగానే కంపెనీ షేరు 3.47 శాతం మేర పడిపోయింది. మే 5 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం మేర కిందకి జారింది. నేటి మార్కెట్లో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లే టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రిపోర్టులపై స్పందించిన ఇన్ఫీ వ్యవస్థాపకలు నారాయణమూర్తి, ఈ వార్తలను ఖండిస్తున్నారు. ప్రమోటర్స్ గ్రూప్ లో నారాయణమూర్తి, ఆయన కుటుంబసభ్యులకే అత్యధికంగా 3.44 శాతం స్టేక్ ఉంది. ఇన్ఫీలో అతిపెద్ద షేర్ హోల్డర్ గా కూడా ఆయనే ఉన్నారు. అయితే ఇంకా ప్రమోటర్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఈ విషయంపై స్పందించలేదు. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు చోటుచేసుకున్న వివాదం తెలిసిందే. గత మూడేళ్లుగా కంపెనీ నడుస్తున్న తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కార్పొరేట్ గవర్నెర్స్ పై బహిరంగంగానే పలుమార్లు బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. అయినా కూడా బోర్డు సభ్యులు ఏ మాత్రం సమస్య లేదన్న రీతిలో వ్యవహరించడం ఈ పరిణామాలకు దారితీస్తోంది. -
5 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ షేరు
ముంబై: స్టాక్ మార్కెట్ లో ఇన్ఫోసిస్ షేరు 5 శాతం పెరిగాయి. మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాల్లో 13 శాతం వృద్ధి నమోదు చేయడంతో ఇన్ఫోసిస్ షేరు బాగా లాభపడింది. 2014-15 మూడో త్రైమాసికంలో రూ. 3,250 కోట్ల నికర లాభం ఆర్జించినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. టీసీఎస్ షేరు 2.8 శాతం, విప్రో షేరు 1.54 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఆద్యంతం ఊగిసలాటలో కొనసాగిన స్టాక్ మార్కెట్ చివరకు లాభాలతో ముగిసింది. ప్రారంభంలో బాగా పెరిగిన మార్కెట్ చివర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలు తగ్గించుకుంది. సెన్సెక్స్ 183 పాయింట్లు లాభపడి 27,458 వద్ద ముగిసింది. ఎస్ఎస్ఈ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు ఎగసి 8,284 వద్ద స్థిరపడింది. -
5.61 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ షేరు
ముంబై: స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభంకాగానే బీఎసీ సూచి సెన్సెక్స్ 335, ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 106 పాయింట్లు పతనమైయ్యాయి. వారాంతంలో మదుపుదారులకు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. అమెరికా, ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండడంతో ఆ ప్రభావం మన మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 335 పాయింట్లు పడిపోయి 26,301 మార్క్ ను తాకింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 7,854 వద్ద కదలాడుతోంది. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ షేరు 5.61 శాతం పెరిగింది. కాగా, తమ వాటాదారులకు ఇన్ఫోసిస్ 1:1 బోనస్ ప్రకటించింది. -
ఇన్ఫీ ఫలితాలపై అంచనాలు తక్కువే..
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ మంగళవారం నాలుగో త్రైమాసికం ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో క్యూ4 ఫలితాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన గెడైన్స్‌లో కనిష్ట స్థాయిని.. అది కూడా అతి కష్టం మీద సాధించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. క్లయింట్లు ఖర్చులు తగ్గించుకుంటుండటం, ప్రాజెక్టులు మందగిస్తుండ టం, కీలకమైన సీనియర్ అధికారులు వరుసగా నిష్ర్కమిస్తుండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది గెడైన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ఆదాయాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం 11.5-12% గెడైన్స్ని ప్రకటించగా..ఈ ఏడాది ఇది 11 శాతానికి మించకపోవచ్చని తెలిపారు. అయితే, కంపెనీ ఇటీవల వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే.. ఇది 7-9% మాత్రమే ఉండగలదని (డాలర్ల మారకంలో) రెలిగేర్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ అంచనా వేసింది. కంపెనీ నిర్వహణ మార్జిన్లు, ఉద్యోగుల వలసల గణాంకాలు తదితర అంశాలు కూడా ఫలితాల్లో కీలకంగా మారనున్నాయి. సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా గతేడాది బాధ్యతలు చేపట్టినప్పట్నుంచీ అధిక మార్జిన్లపై దృష్టితో పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది మూడో త్రైమాసికంలో పోటీ కంపెనీలైన టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థల్లో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 9-10% ఉండగా, ఇన్ఫోసిస్‌లో 18.1% నమోదైంది. మార్జిన్లు, అట్రిషన్ అంశాలే కాకుండా ప్రోడక్టులు.. ప్లాట్‌ఫామ్‌ల వ్యాపార విభాగాన్ని విడదీసే విషయం గురించి ఇన్ఫీ ఈసారైనా నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, చేతిలో ఉన్న నిధులు (సుమారు రూ. 27,440 కోట్లు) సద్వినియోగం చేసేందుకు ఏదైనా కొత్త కంపెనీని కొనుగోలు చేసే విషయం కూడా చర్చనీయాంశమైంది.