ఇది కూడా ఇన్ఫీని ఆదుకోలేకపోతుంది
ఇది కూడా ఇన్ఫీని ఆదుకోలేకపోతుంది
Published Mon, Aug 21 2017 10:25 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను బైబ్యాక్ ఆఫర్ కూడా ఆదుకోలేకపోతుంది. సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో మొదలైన ఇన్ఫీ షేర్ల పతనం, సోమవారం ట్రేడింగ్‌లోనూ కొనసాగుతోంది. పలు బ్రోకరేజ్ సంస్థలు ఇన్ఫోసిస్ షేరు విలువను డౌన్ గ్రేడ్ చేయడంతో, ప్రారంభ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు 4.39 శాతం పడిపోతూ.. రెండేళ్ల కనిష్ట స్థాయిల వద్ద నమోదవుతున్నాయి. శుక్రవారం విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించడంతో, ఆ రోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్ఫీ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో దాదాపు 13 శాతం మేర షేరు విలువ దిగజారింది. దీంతో ఇన్ఫీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.30వేల కోట్ల మేర ఆవిరైపోయింది. కాగ, సిక్కా రాజీనామా అనంతరం ఒక్కరోజు వ్యవధిలోనే అంటే శనివారం ఇన్ఫోసిస్ రూ.13వేల కోట్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇది మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 4.92 శాతం. బైబ్యాక్ ఆఫర్‌తో కంపెనీ షేర్లు కోలుకుంటాయని విశ్లేషకులు భావించారు.
కానీ ఇన్ఫీ షేర్లు కోలుకోకపోగా, రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. కంపెనీ నుంచి విశాల్ సిక్కా వైదొలగడం, స్వల్పకాలకంగా, మధ్యకాలికంగా ఇన్పీ పనితీరుపై ప్రభావం చూపుతుందని, 2017-18 ఆర్థిక సంవత్సర గైడెన్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయంటూ బ్రోకరేజ్ సంస్థలు చెప్పాయి. రూ.929 వద్ద ప్రారంభమైన షేరు విలువ రూ.929 వద్ద గరిష్ట స్థాయిలను, రూ.882.55 వద్ద కనిష్ట స్థాయిలను నమోదుచేసింది. మరోవైపు మిగతా ఐటీ దిగ్గజాలు టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రోలు లాభాలు పండిస్తున్నాయి. సిక్కా దెబ్బకు పతనమైన మార్కెట్లు కూడా నేటి ట్రేడింగ్‌లో పునరుద్ధరించుకున్నాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు మేర పైకి ఎగిసింది.
Advertisement