ఇన్ఫోసిస్ షేర్లకు బైబ్యాకు జోరు
ఇన్ఫోసిస్ షేర్లకు బైబ్యాకు జోరు
Published Thu, Aug 17 2017 3:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇంట్రాడేలో ఇన్ఫోసిస్ షేర్లు 4.63 శాతం మేర పైకి ఎగిసి, రూ.1,020.25 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదుచేశాయి. ఆగస్టు 19(శనివారం) షేరు బై బ్యాకు ప్రతిపాదనపై కంపెనీ బోర్డు సమావేశం కాబోతుందని ఇన్ఫీ తెలిపిన నేపథ్యంలో షేర్ల జోరు ఊపందుకుంది. '' ఇన్ఫోసిస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కంపెనీ ఈక్విటీ షేర్లు బైబ్యాకు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు 2017 ఆగస్టు 19న సమావేశం ఏర్పాటుచేస్తున్నాం'' అని ఇన్ఫోసిస్ బొంబై స్టాక్ ఎక్స్చేంజీకి ప్రకటన విడుదల చేసింది.
ఆటోమేషన్, కొన్ని దేశాల్లో వీసా నిబంధనల కఠినతరంతో ఐటీ కంపెనీల కోర్ బిజినెస్‌ల వృద్ది నెమ్మదించింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. 2017 జూన్ 30 నాటికి ఇన్ఫోసిస్ వద్ద లిక్విడ్ అసెట్స్(నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు) రూ.39వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఐటీ కంపెనీల వద్ద నగదు నిల్వలు మంచిగా ఉండటంతో, వాటిని షేర్ హోల్డర్స్‌కు పంచాలని బాగా ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీల్లో అతిపెద్ద దిగ్గజం టీసీఎస్ కూడా షేర్ బైబ్యాక్స్‌ను ప్రకటించింది. రూ.16,000 కోట్ల షేరు బైబ్యాకును ఈ ఏడాది మేలో పూర్తిచేసింది. విప్రో కూడా గత నెలలో రూ.11,000 కోట్ల బైబ్యాకును చేపట్టనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం 4.50 శాతం పైగా పెరిగి రూ.1,020 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement