ఇన్ఫీ ఫలితాలపై అంచనాలు తక్కువే..
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ మంగళవారం నాలుగో త్రైమాసికం ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో క్యూ4 ఫలితాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన గెడైన్స్‌లో కనిష్ట స్థాయిని.. అది కూడా అతి కష్టం మీద సాధించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. క్లయింట్లు ఖర్చులు తగ్గించుకుంటుండటం, ప్రాజెక్టులు మందగిస్తుండ టం, కీలకమైన సీనియర్ అధికారులు వరుసగా నిష్ర్కమిస్తుండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు.
ఫలితంగా ఈ ఏడాది గెడైన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ఆదాయాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం 11.5-12% గెడైన్స్‌ని ప్రకటించగా..ఈ ఏడాది ఇది 11 శాతానికి మించకపోవచ్చని తెలిపారు. అయితే, కంపెనీ ఇటీవల వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే.. ఇది 7-9% మాత్రమే ఉండగలదని (డాలర్ల మారకంలో) రెలిగేర్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ అంచనా వేసింది. కంపెనీ నిర్వహణ మార్జిన్లు, ఉద్యోగుల వలసల గణాంకాలు తదితర అంశాలు కూడా ఫలితాల్లో కీలకంగా మారనున్నాయి. సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా గతేడాది బాధ్యతలు చేపట్టినప్పట్నుంచీ అధిక మార్జిన్లపై దృష్టితో పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇక గతేడాది మూడో త్రైమాసికంలో పోటీ కంపెనీలైన టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థల్లో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 9-10% ఉండగా, ఇన్ఫోసిస్‌లో 18.1% నమోదైంది. మార్జిన్లు, అట్రిషన్ అంశాలే కాకుండా ప్రోడక్టులు.. ప్లాట్‌ఫామ్‌ల వ్యాపార విభాగాన్ని విడదీసే విషయం గురించి ఇన్ఫీ ఈసారైనా నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, చేతిలో ఉన్న నిధులు (సుమారు రూ. 27,440 కోట్లు) సద్వినియోగం చేసేందుకు ఏదైనా కొత్త కంపెనీని కొనుగోలు చేసే విషయం కూడా చర్చనీయాంశమైంది.