
ఉద్యోగ కోతలపై కృత్రిమ మేధ (ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం ఎలా ఉందో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలు పంచుకున్నారు. కృత్రిమ మేధ వల్ల కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐ ప్రభావంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
కృత్రిమ మేధ-ఉద్యోగ నష్టాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి చాలా పనులను ఆటోమేట్ చేస్తోందని మూర్తి చెప్పారు. దాంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. అయితే ఇది కొత్త అవకాశాలను సృష్టించడానికి, మానవ ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అంగీకరించారు. 1970ల్లో కంప్యూటర్-ఎయిడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సాధనాలను ప్రవేశపెట్టిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కానీ ఈ సాధనాలు డెవలపర్లకు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పించాయన్నారు. ఉత్పాదకతను పెంచడానికి మానవులు, యంత్రాలు కలిసి పనిచేసే సహాయక సాంకేతికతగా కృత్రిమ మేధను పరిగణించాలని మూర్తి అన్నారు. అటానమస్ డ్రైవింగ్, ప్రమాదకర వాతావరణంలో యంత్రాలను ఆపరేట్ చేయడం, కచ్చితమైన పరికరాలతో రిమోట్ సర్జరీ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా మానవులు మరింత సృజనాత్మక, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఇది ఉద్యోగుల నైపుణ్యాల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌లో బ్లాక్‌రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలు
ఏఐ ఇన్నోవేషన్‌లో భారత్ పాత్ర
కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు చేయడంలో భారత్ సామర్థ్యంపై మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికతలను అవలంబించడమే కాకుండా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి దోహదపడే స్థాయికి దేశం పురోగమించిందని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను స్వీకరించి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలని యువతను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment