బ్యాంకింగ్‌లో మరిన్ని ఏకీకరణలు
ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం మంచి అడుగు: కేవీ కామత్
న్యూఢిల్లీ: ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం ఓ మంచి తొలి అడుగుగా బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) చైర్మన్ కేవీ కామత్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశ అవసరాలు తీర్చాలంటే పెద్ద బ్యాంకులు ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, బ్యాంకింగ్ రంగానికి తలనొప్పిగా మారిన నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంక్ అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటులోనూ..
‘‘మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం దృష్ట్యా మరిన్ని పెద్ద బ్యాంకుల అవసరం ఉంది. కనుక ప్రభుత్వ రంగంలో మరిన్ని బ్యాంకుల మధ్య ఏకీకరణకు వీలుంది. అంతేకాదు, ప్రైవేటు రంగంలోనూ వీలీనాల అవసరం ఉంది. ఎందుకంటే, మన ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చాలంటే చాలా పెద్ద బ్యాంకులు కావాలి. బ్యాంకులు సొంతంగా అయినా ఆ స్థాయికి ఎదగాలి. లేదా విలీనాలను అయినా చేపట్టాలి’’ అని కామత్ అన్నారు. ఎన్‌డీబీ రెండో వార్షికోత్సవ సమావేశం నేపథ్యంలో ఢిల్లీకి వచ్చిన ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇది కేవలం కొన్ని బ్యాంకులను ఒక్కటి చేయడం లేదా రెండు బ్యాంకులను ఒకటిగా మార్చడమన్న అంకెలుగానే ఉండరాదన్నారు. బ్యాడ్ బ్యాంకుకు ఎన్‌డీబీ నిధులు అందించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదంటూ, తమ దృష్టి అంతా మౌలిక సదుపాయాలకు నిధులు అందించడంపైనేనని స్పష్టం చేశారు.