
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోతలు విధిస్తున్నప్పటికీ ఎకానమీ అధిక వృద్ధి బాటలోనే ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 6.5 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో మిగతా ఏ దేశంతో పోల్చి చూసినా భారత్ చాలా ముందే ఉందని సన్యాల్ పేర్కొన్నారు.
‘ఏడీబీ (ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్), ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాదికి సంబంధించి వృద్ధి అంచనాలను స్వల్పంగానే కుదించాయి. ఈ అంచనాల ప్రకారం చూసినా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదిగే ఎకానమీగా ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. వినియోగం మందగించడం, అంతర్జాతీయంగా కఠిన పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ఇటీవలే 6.3 – 6.4 శాతం శ్రేణికి ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు కుదించాయి. దీనివల్ల మనమేమీ వెనకబడిపోతున్నట్లుగా భావించాల్సిన అవసరం లేదని సన్యాల్ చెప్పారు.
కేంద్రం తీసుకుంటున్న చర్యలతో 8 శాతం పైగా వృద్ధి రేటు సాధించే సత్తా ఉన్నప్పటికీ ఎగుమతులు, దిగుమతులపరంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాకా భారత్ వృద్ధి రేటు మరింత వేగవంతం కాగలదని సన్యాల్ చెప్పారు. వివిధ సంస్కరణలతో బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసినందున అమెరికా, యూరప్ బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావాలు భారత ఆర్థిక రంగంపై ప్రత్యక్షంగా ఉండబోవని సన్యాల్ తెలిపారు. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నందున అప్రమత్తత కొనసాగించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment