2025–26లో 6.7 శాతం
2026–27లో 6.8 శాతం
0.2 శాతం మేర తగ్గింపు
2024–25కు 6.8 శాతం కొనసాగింపు
న్యూఢిల్లీ: భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి వృద్ధి అంచనాలపై తాజా నివేదికను విడుదల చేసింది. 2025–26లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2026–27) 6.8 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ గత అంచనాలు వరుసగా 6.9%, 7% చొప్పున ఉండడం గమనార్హం. అంటే 0.2 % మేర తగ్గించినట్టు తెలుస్తోంది. అధిక స్థాయిలో వడ్డీ రేట్లు, పట్టణాల్లో డిమాండ్ తగ్గడాన్ని తన తాజా నిర్ణయం వెనుక ప్రధాన అంశాలుగా ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–15) 6.8% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 2027–28 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7%గా ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది.
‘భారత్‌లో జీడీపీ వృద్ధి 2024–25లో 6.8%కి నిదానించొచ్చు. అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఆర్థిక ఉద్దీపనలు పట్టణ డిమాండ్‌ను తగ్గించనున్నాయి. అదే సమయంలో పీఎంఐ ఇంకా విస్తరణ దశలోనే ఉంది. ఇతర ముఖ్యమైన ఆర్థిక సూచికలు మాత్రం వృద్ధి నిదానించినట్టు చెబుతున్నాయి’ అని తెలిపింది. మరోవైపు 2024లో చైనా 4.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందన్న గత అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ కొనసాగించింది. ట్రంప్ సర్కారు రూపంలోరానున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి చైనా వృద్ధి అంచనాలకు కోత విధించింది.
Comments
Please login to add a commentAdd a comment