2021-22 వృద్ధి రేటు అంచనాలను భారీగా కోత
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి భారీ వృద్ధి అంచనాలకు భారీగా కోతపెడుతున్న సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ చేరింది. ఫిబ్రవరిలో వేసిన 13.7 శాతం వృద్ధి అంచనాలను భారీగా 4.4 శాతం తగ్గించి 9.3 శాతానికి కుదించింది. తాజా పరిస్థితులు ఎకానమీ రికవరీకి తీవ్ర అడ్డంకిగా మారాయని మూడీస్ పేర్కొంది. ఈ ప్రతికూల ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందనీ హెచ్చరించింది. మూడీస్ ప్రస్తుతం ఇతర రేటింగ్ దిగ్గజ సంస్థలు- ఎస్అండ్పీ, ఫిచ్ తరహాలోనే భారత్‌కు ‘చెత్త’ స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువగా ‘నెగటివ్ అవుట్‌లుక్‌తో బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది.
మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15-మే 3, మే 4-మే 17, మే 18-మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వరకూ క్షీణరేటు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నాల్గవ త్రైమాసికంలో పరిస్థితి కుదుటపడుతున్నట్లు కనిపించినా ఊహించని రీతిలో కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మూడీస్ భారత్ ఆర్థిక వ్యవస్థపై మంగళవారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే..
అధిక రుణ భారం (జీడీపీలో దాదాపు 90 శాతానికి చేరుతుందన్న అంచనా) బలహీన ఫైనాన్షియల్ వ్యవస్థలు సార్వభౌమ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒత్తిడులను తీవ్రతరం చేస్తున్నాయి.
సెకండ్ వేవ్‌తో ఉత్పన్నమైన పరిస్థితలు భారత్ ఆరోగ్య వ్యవస్థపై ప్రతికూలను చూపుతున్నాయి. ఆసుపత్రులు క్రిక్కిరిసిపోయిన పరిస్థితి. మెడికల్ సరఫరాల్లో తీవ్ర కొరత ఏర్పడుతోంది.
వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై 2020 తరహా తీవ్ర పర్యవసానాలు ఉండబోవు. ఆయా స్థానిక చర్యలు స్వల్పకాలమే కొనసాగే అవకాశం ఉండడం, వ్యాపారాలు, వినియోగదారులు కరోనాతో కలిసి పనిచేయడానికి మార్గాలను అన్వేషిస్తుండటం దీనికి కారణం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలు 7.9 శాతంగా ఉండే వీలుంది. దీర్ఘకాలంలో 6 శాతంగా ఉండవచ్చు.
క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడంలో విధాన నిర్ణయ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఇక ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021-22లో 10.8 శాతం ఉంటుందని క్రితం వేసిన అంచనాలు మరింతగా 11.8 శాతానికి పెంపు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉన్న రుణ భారం 2023లో 92 శాతానికి ఎగసే అవకాశాలు ఉన్నాయి.
మరో రెండు దిగ్గజ రేటింగ్ సంస్థలు ఇలా...
ఎస్అండ్పీ గ్లోబల్ 2021-22 ఆర్థిక సంవత్సరం 11 శాతం వృద్ధి తొలి (మార్చి) అంచనాలను దిగువముఖంగా సవరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కరోనా కొత్త కేసులు మే చివరినాటికి గరిష్టానికి చేరి, అక్కడినుంచీ పెరక్కుండా తగ్గుతూ వస్తే, భారత్ 9.8 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. అయితే జూన్ చివరి వరకూ ఈ పరిస్థితి లేకపోతే 8.2 శాతానికి కూడా వృద్ధి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. భారత్‌కు ఎస్అండ్పీ 13 సంవత్సరాలుగా స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ రేటింగ్‌ను ఇస్తోంది. రెండేళ్లు ఈ రేటు మార్చబోమని కూడా ఇటీవలే భరోసా ఇచ్చింది. ఇక ఫిచ్ రేటింగ్స్ అంచనా ఇప్పటి వరకూ 2021-22లో 12.8 శాతంగా కొనసాగుతోంది. అయితే 2022-23లో ఇది 5.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ఫిచ్ దేశానికి నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ అవుట్‌లుక్ ఇస్తోంది. అయితే ఫిచ్ గ్రూప్ సంస్థ- ఫిచ్ సొల్యూషన్ మాత్రం 2020-21 వృద్ధి అంచనాలను ఇప్పటికే 12.8 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది.
కోతల బాటనే నోమురా
జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం- నోమురా కూడా భారత్ 2021-22 వృద్ధి అంచనాలకు భారీ కోత పెట్టింది. తొలి 12.6 శాతం అంచనాలను 10.8 శాతానికి కుదించింది. ఆర్థిక క్రియాశీలతకు సంబంధించి తన ప్రొప్రైటరీ ఇండెక్స్ మే 9వ తేదీతో ముగిసిన వారంలో 64.5 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. వారం వారీగా ఇది 5 శాతం పతనమని పేర్కొన్న నోమురా, 2020 జూన్ నాటి పరిస్థితికి ఆర్థిక క్రియాశీలత జారిపోయిందని తెలిపింది. ఇండెక్స్‌లో భాగమైన రవాణా విభాగం 10 శాతం పడిపోయిందనీ, విద్యుత్ డిమాండ్ 4.1 శాతం తగ్గిందని వివరించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఎకానమీ రికవరీకి తీవ్ర విఘాతంగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. తద్వారానే మహమ్మారి వేగాన్ని నియంత్రించవచ్చని సూచించింది. దేశంలో ఆరోగ్య రంగంపై వ్యయాలు మరింత పెంపుపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి ఉద్ఘాటిస్తోందని తన తాజా నివేదికలో అభిప్రాయపడింది.
కేర్ అంచనాలు... నాల్గవసారి!
కేర్ రేటింగ్స్ మంగళవారం మరోసారి భారత్ 2021-22 వృద్ధి అంచనాలను సవరించింది. 10.2 శాతం నుంచి 9.2 శాతానికి అంచనాలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 2021 మార్చి 24న సంస్థ 11 నుంచి 11.2 శాతం అంచనాలను వెలువరించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 5న 10.7 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 21న మరింతగా 10.2 శాతానికి సవరించింది.
తీవ్ర జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్!
భారత్ ‘తీవ్ర జీవనోపాధి సంక్షోభం’ దిశగా పయనించే అవకాశం ఉందని బెల్జియంకు చెందిన ఇండియన్ ఎకనమిస్ట్ ప్రముఖ ఎకనమిస్ట్ జీన్ డ్రెజ్ హెచ్చరించారు. సెకండ్‌వేవ్ తీవ్రత, రాష్ట్రాల స్థానిక ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యం- శ్రామిక వర్గంపై పిడుగుపాటుగా మారవచ్చని ఒక ఇంటర్వ్యూలో సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆంక్షల వల్ల ఏర్పడిన పరిస్థితి ‘దాదాపు జాతీయ లాక్డౌన్’ను తలపిస్తోందని అన్నారు. 2024–25 నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యం ‘‘సాకారమయ్యే’’ అవకాశమే లేదని అన్నారు. దేశానికి సంబంధించి భారత్‌లో కొన్ని వర్గాల ‘‘సూపర్–పవర్ ఆశయాలు’’ సాధ్యమబోవని అభిప్రాయపడ్డారు. శ్రామిక వర్గం పరిస్థితి 2020కన్నా ప్రస్తుతం భిన్నంగా ఏమీ లేదని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వానికి సలహాలను ఇచ్చిన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)లో జీన్ డ్రెజ్ సభ్యుడు కావడం గమనార్హం.
భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికీ కష్టమే : నిషా దేశాయ్ బిస్వాల్
వాషింగ్టన్: భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికి కూడా కష్టకాలంగానే ఉంటుందని అమెరికా-భారత్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కరోనా వైరస్ పరమైన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలియగానే అమెరికా కార్పొరేట్ సంస్థలు అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటానికి టాప్ 40 కంపెనీల సీఈవోలతో కొత్తగా గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనట్లు తెలిపారు.
భారత్ మళ్లీ పుంజుకుంటుంది: ఐక్యరాజ్యసమితి
ఐక్యరాజ్యసమితి: భారత్ 2022లో తిరిగి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రకటించింది. భారత జీడీపీ 10.1 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2021 సంవత్సరానికి మాత్రం భారత వృద్ధి అవకాశాలు చాలా బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారికి నూతన కేంద్రంగా భాతర్ మారడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక స్థితిపై వార్షిక మధ్యంత నివేదికను మంగళవారం విడుదల చేసింది.
చదవండి:
ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు