వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం
భారత్‌పై ఎస్‌అండ్‌పీ నివేదిక
న్యూఢిల్లీ: భారత్ 8 శాతం వృద్ధి సాధనకు వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమని గ్లోబల్ రేటింగ్స్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) తన తాజా నివేదికలో తెలిపింది. దివాలా బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని ఈ సందర్భంగా ప్రశంసించిన ఎస్‌అండ్‌పీ.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తదుపరి లక్ష్యంగా ఉండాలని సూచించింది. చైనా, తదితర ఆర్థిక వ్యవస్థల ఒడిదుడుకుల నుంచి భారత్ తట్టుకుని నిలబడగలుగుతున్నట్లు వివరించింది.
గడచిన ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.6 శాతం కాగా, అది 2016-17లో 7.9 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 8 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. తగిన వర్షపాతం అంచనాలు నిజంకావడంసహా... ఫైనాన్షియల్ మార్కెట్ స్థిరపడ్డం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును ఇచ్చే బడ్జెట్, సంస్కరణల పథంలో దేశం ముందుకు సాగుతుండటం వంటి అంశాలు... ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఇబ్బందులను తగ్గిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ అభిప్రాయపడింది. గ్రామీణ వినియోగం పెరుగుతుందని, వృద్ధికి పెట్టుబడుల మద్దతు ఉంటుందని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నట్లు తన ఏపీఏసీ ఎకనమిక్ స్నాప్‌షార్ట్స్‌లో రేటింగ్ సంస్థ పేర్కొంది.