ratings agency s and p
-
భారత వృద్ధి అంచనాలకు ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి వృద్ధి అంచనాలపై తాజా నివేదికను విడుదల చేసింది. 2025–26లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2026–27) 6.8 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ గత అంచనాలు వరుసగా 6.9%, 7% చొప్పున ఉండడం గమనార్హం. అంటే 0.2 % మేర తగ్గించినట్టు తెలుస్తోంది. అధిక స్థాయిలో వడ్డీ రేట్లు, పట్టణాల్లో డిమాండ్ తగ్గడాన్ని తన తాజా నిర్ణయం వెనుక ప్రధాన అంశాలుగా ఎస్అండ్పీ తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–15) 6.8% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 2027–28 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7%గా ఉండొచ్చని ఎస్అండ్పీ అంచనా వేసింది. ‘భారత్‌లో జీడీపీ వృద్ధి 2024–25లో 6.8%కి నిదానించొచ్చు. అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఆర్థిక ఉద్దీపనలు పట్టణ డిమాండ్‌ను తగ్గించనున్నాయి. అదే సమయంలో పీఎంఐ ఇంకా విస్తరణ దశలోనే ఉంది. ఇతర ముఖ్యమైన ఆర్థిక సూచికలు మాత్రం వృద్ధి నిదానించినట్టు చెబుతున్నాయి’ అని తెలిపింది. మరోవైపు 2024లో చైనా 4.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందన్న గత అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కొనసాగించింది. ట్రంప్ సర్కారు రూపంలోరానున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి చైనా వృద్ధి అంచనాలకు కోత విధించింది. -
వృద్ధి రేటుకు కరోనా కాటు..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 5.2 శాతానికే పరిమితమవుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. కోవిడ్-19 వ్యాప్తితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతోందని పేర్కొంది. 2020 కేలండర్ సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి రేటు 5.7 శాతంగా ఉంటుందని గతంలో ఎస్అండ్పీ అంచనా వేయగా కరోనా మహమ్మారి ప్రభావంతో వృద్ధి రేటు అంచనాను తాజాగా 5.2 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుండటంతో ఆసియా పసిఫిక్ వృద్ధిరేటు 2020లో మూడు శాతానికే పరిమితమవుతుందని ఎస్అండ్పీ పేర్కొంది. కరోనా కేంద్రమైన చైనా అతలాకుతలం కావడం, అమెరికా, యూరప్‌లలో షట్డౌన్లు, స్ధానికంగా వైరస్ వ్యాప్తి వంటి అంశాలతో ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లో చిక్కుకుంటోందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ షౌన్ రోచే స్పష్టం చేశారు. 2020లో చైనా, భారత్, జపాన్ వృద్ధిరేట్లను తాము వరుసగా 2.9, 5.2, -1.2 శాతానికి తగ్గించామని ఎస్అండ్పీ పేర్కొంది. ఇక మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సైతం 2020లో భారత వృద్ధి రేటును 5.4 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గించింది. చదవండి : సైన్యంలో తొలి కరోనా కేసు -
వృద్ధి 5.1 శాతం మించదు
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘‘పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, బ్యాంకింగ్ రుణ వృద్ధి, పన్ను వసూళ్లు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక స్వల్పకాలిక సూచీలన్నీ బలహీన ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది’’ అని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వస్తు, సేవల పన్ను, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, దివాలా చట్టం వంటివి ఆర్థిక వ్యవస్థపై ఇంకా కొంత ప్రతికూలతను చూపుతున్నాయని, ఆయా అంశాల అమలు, సర్దుబాట్లలో బాలారిష్టాలు తొలగిపోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల బలహీనత వంటి పరిస్థితులను చూస్తుంటే డిమాండ్ పూర్తిగా కిందకు జారిన పరిస్థితులు స్పష్టమవుతున్నాయని వివరించింది. ఈ నివేదిక నేపథ్యం చూస్తే... ► ఆర్థిక సంవత్సరం మొత్తంలో కేవలం వృద్ధి 4.7 శాతంగానే ఉంటుందని నోమురా అంచనా. ► శుక్రవారం వెలువడిన క్యూ2 ఫలితాల్లో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ► ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష గురువారం జరగనున్న నేపథ్యంలో క్రిసిల్ తాజా నివేదిక వెలువడింది. అక్టోబర్‌లో జరిగిన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ 2019–20 వృద్ధి రేటును 7 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది. శుక్రవారంనాటి గణాంకాల నేపథ్యంలో.. వృద్ధిపై ఆర్బీఐ భవిష్యత్ అంచనా చూడాల్సి ఉంది. సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్‌బీ అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ– డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను దెబ్బతీసిందని పేర్కొంది. నవంబర్‌లో ‘తయారీ’ కొంచెం బెటర్ : పీఎంఐ కాగా, తయారీ రంగం నవంబర్‌లో కొంత మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) సర్వే పేర్కొంది. సూచీ 51.2గా నమోదయిందని పేర్కొంది. అక్టోబర్‌లో ఈ సూచీ రెండేళ్ల కనిష్ట స్థాయి 50.6గా ఉంది. అయితే పీఎంఐ 50కు ఎగువన ఉన్నంతవరకూ దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సర్వే ప్రకారం.. నవంబర్‌లో కొన్ని కంపెనీలు కొత్త ఆర్డర్లు పొందగలిగితే, మరికొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నాయి. -
బ్యాంకుల రేటింగ్లలో కోత
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రేటింగ్ అంచనాలను స్థిర స్థాయి నుంచి నెగెటివ్ స్థాయికి తగ్గించినట్లు ఎస్అండ్పీ రేటింగ్స్ సంస్థ తెలిపింది. రాబోయే ఏడాదిన్నర కాలంలో మొండి బకాయిల భారం మరింత పెరగొచ్చన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కొంత పటిష్టమైన, ప్రభుత్వం నుంచి మద్దతు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్యాంకుగా సూచిస్తూ.. స్వల్పకాలికంగా ‘ఏ-3’, దీర్ఘకాలికంగా ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్అండ్పీ క్రెడిట్ అనలిస్టు అమిత్ పాండే చెప్పారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను(ఐవోబీ) కూడా ప్రతికూల అంచనాలతో.. ప్రత్యేకంగా గమనించాల్సిన విభాగంలోకి(క్రెడిట్వాచ్) ఎస్అండ్పీ చేర్చింది. ఎన్పీఏలతో నష్టాలు మరింత పెరగొచ్చన్న అంచనాలు దీనికి కారణం. ఐవోబీకి దీర్ఘకాలికంగా ‘బిబిప్లస్’, స్వల్పకాలికంగా ‘బి’ రేటింగ్ ఉంది. ఐడీబీఐ బ్యాంకునకు బిబిప్లస్ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది.