వృద్ధి 5.1 శాతం మించదు | CRISIL cuts GDP growth to 6.3persant in fiscal 2020 | Sakshi
Sakshi News home page

వృద్ధి 5.1 శాతం మించదు

Published Tue, Dec 3 2019 6:00 AM | Last Updated on Tue, Dec 3 2019 6:00 AM

CRISIL cuts GDP growth to 6.3persant in fiscal 2020 - Sakshi

ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తన తాజా నివేదికలో పేర్కొంది.  ‘‘పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి, పన్ను వసూళ్లు, రవాణా, విద్యుత్‌ ఉత్పత్తి వంటి కీలక స్వల్పకాలిక సూచీలన్నీ బలహీన ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.

అయితే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్‌–మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది’’ అని క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. వస్తు, సేవల పన్ను, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్, దివాలా చట్టం వంటివి ఆర్థిక వ్యవస్థపై ఇంకా కొంత ప్రతికూలతను చూపుతున్నాయని, ఆయా అంశాల అమలు, సర్దుబాట్లలో బాలారిష్టాలు తొలగిపోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల బలహీనత వంటి పరిస్థితులను చూస్తుంటే డిమాండ్‌ పూర్తిగా కిందకు జారిన పరిస్థితులు స్పష్టమవుతున్నాయని వివరించింది.  ఈ నివేదిక నేపథ్యం చూస్తే...

► ఆర్థిక సంవత్సరం మొత్తంలో కేవలం వృద్ధి 4.7 శాతంగానే ఉంటుందని నోమురా అంచనా.
► శుక్రవారం వెలువడిన క్యూ2 ఫలితాల్లో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి  4.5 శాతానికి పడిపోయింది.  
► ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష గురువారం జరగనున్న నేపథ్యంలో క్రిసిల్‌ తాజా నివేదిక వెలువడింది. అక్టోబర్‌లో జరిగిన  సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ 2019–20 వృద్ధి రేటును 7 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది. శుక్రవారంనాటి గణాంకాల నేపథ్యంలో.. వృద్ధిపై ఆర్‌బీఐ భవిష్యత్‌ అంచనా చూడాల్సి ఉంది.


సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్‌బీ
అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ– డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్‌ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను దెబ్బతీసిందని పేర్కొంది.

నవంబర్‌లో ‘తయారీ’ కొంచెం బెటర్‌ : పీఎంఐ
కాగా, తయారీ రంగం నవంబర్‌లో కొంత మెరుగుపడినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) సర్వే పేర్కొంది. సూచీ 51.2గా నమోదయిందని పేర్కొంది. అక్టోబర్‌లో ఈ సూచీ రెండేళ్ల కనిష్ట స్థాయి 50.6గా ఉంది. అయితే పీఎంఐ 50కు ఎగువన ఉన్నంతవరకూ దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సర్వే ప్రకారం.. నవంబర్‌లో కొన్ని కంపెనీలు కొత్త ఆర్డర్లు పొందగలిగితే, మరికొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement