న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022– 23) భారత్ జీడీపీ 6.5 శాతం నుంచి 7.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయింట్ ఇండియా అంచనా వేసింది. ‘‘ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా అధిక స్థాయిల్లోనే ఉంటూ విధానకర్తలకు సవాలుగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్‌బీఐ 1.9 శాతం రెపో రేటు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట పరిమితికి పైనే 9 నెలలుగా కొనసాగుతోంది. డాలర్ బలపడడంతో దిగుమతుల బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగింది.
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది ముగింపు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మాంద్యం తలెత్తవచ్చు. దీంతో పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం భారత్ వృద్ధి కారకాలపై చూపించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తుకు సంబంధించి స్థిరమైన అంచనాలు వేయడం కష్టమే’’అని డెలాయిట్ ఇండియా తన నివేదికలో వివరించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత్ జీడీపీ 5.5–6.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే.
సవాళ్లు ఉన్నాయ్..
‘‘పండుగల సీజన్ వినియోగ రంగానికి తగినంత ప్రోత్సాహాన్నిస్తుందని అంచనా వేశాం. కానీ, ఇది ఇంకా స్థిరమైన పునరుద్ధరణను చూపించలేదు. పరిశ్రమలో, తయారీ రంగంలో రుణాల వృద్ధి చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. దీంతో ప్రైవేటు రంగంలో మూలధన పెట్టుబడులకు ఎంతో సానుకూల అవకాశాలున్నాయి. స్థిరమైన పెట్టుబడులకు సుస్థిరమైన డిమాండ్ అవసరం. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతున్న తరుణంలో ఎగుమతులు, ప్రభుత్వ తోడ్పాటు అన్నవి వృద్ధికి కావాల్సినంత మద్దతును ఇవ్వలేవు. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, కరెన్సీ విలువ క్షీణత రూపంలో వృద్ధి క్షీణించే రిస్క్‌లు సైతం ఉన్నాయి’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి మజుందార్ తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు 2023 మధ్య నాటికి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు డెలాయిట్ తెలిపింది. ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టి, కంపెనీల ముడి సరుకుల ధరలు సైతం దిగొస్తాయని, ఫలితంగా దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు క్షీణిస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment